ఒక్క చేరిక, మూడు సీట్ల పై ఎఫెక్ట్ - గెలుపు దక్కేదెవరికి..!!
ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. పార్టీల మార్పులు సీట్ల పైన ప్రభావం చూపుతున్నాయి. సీనియర్లకు సీట్ల ఖరారు పై ప్రతిష్ఠంబన కొనసాగుతోంది. కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు సెగ్మెంట్ లో రాజకీయం మూడు నియోజకవర్గాల పైన ప్రభావం చూపుతోంది. రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ పెంచుతోంది.
ఎవరి సీటు ఎక్కడ
పెనమలూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్ధసారధి టీడీపీలో చేరారు. పార్టీలో చేరకుమందే ఆయనకు నూజివీడు సీటు ఖరారు చేసారు. అక్కడ టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న ముద్రబోయిన ఆగ్రహంతో ఉన్నారు. సీఎం జగన్ ను కలిసారు. కానీ, వైసీపీలో చేరలేదు. ఆయన అక్కడ స్వతంత్రగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. పెనమలూరులో టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న బోడే ప్రసాద్ సీటు దక్కుతుందా లేదా అనే టెన్షన్ మొదలైంది. మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. మైలవరం సీటు ఆయనకే ఇవ్వటం దాదాపు ఖాయమైంది. దీంతో, అక్కడ సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా , బొమ్మసాని మధ్య రాజకీయం పతాక స్థాయికి చేరింది.

మారుతున్న లెక్కలు
వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరటంతో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ, సడన్ గా బొమ్మసాని మాజీ మంత్రి దేవినేని ఉమా పైన ఫైర్ అయ్యారు. ఉమ కారణంగానే జిల్లాలో పార్టీలో ఈ పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. అటు వసంత కృష్ణ ప్రసాద్ తాను ఎవరికీ వ్యతిరేకం కాదని..అందరినీ కలుపుకొని వెళ్తానని చెబుతున్నారు. అయితే, మైలవరం సీటు వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయిస్తే ఉమాను పెనమలూరు పంపిస్తారనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సర్వే సైతం చేసినట్లు చెబుతున్నారు. ఇటు పెనమలూరు సీటు పైన ఆశలు పెట్టుకున్న బోడే ప్రసాద్ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు.
కొత్త సమీకరణాలు
తనకు కాకుండా మరెవరికి సీటు కేటాయించిన బోడే ప్రసాద్ తీసుకొనే నిర్ణయం కీలకం కానుంది. ఇటు పెనమలూరు నుంచి వైసీపీ అభ్యర్దిగా మాజీ మంత్రి జోగి రమేష్ నిలుస్తున్నారు. టీడీపీలో సీటు రాకపోతే బోడే ప్రసాద్ తనకు సహకరించాలని కోరుతున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలను తమకు అనుకూలగా మలచుకొనేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ సమయం లోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు. సీట్ల ప్రకటనకు ముందే మూడు నియోజకవర్గాల నేతలతో చర్చలు చేయాలని నిర్ణయించారు. దీంతో, రానున్న రోజుల్లో పెనమలూరు కేంద్రంగా రాజకీయం అనూహ్య మలుపులు తిరుగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications