పెద్దిరెడ్డి Vs నల్లారి బిగ్ ఫైట్ - కొత్త లెక్కలు, కలిసొచ్చేదెవరికి..!!
ఏపీ ఎన్నికల్లో ఈ సారి చిత్తూరు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గం పై వైసీపీ ఈ సారి ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. పెద్దిరెడ్డి జిల్లాలో వైపీపీ రాజకీయాలను శాసిస్తున్నారు. చంద్రబాబు కు ఇప్పుడు పెద్దిరెడ్డి టార్గెట్ అయ్యారు. అదే సమయంలో పెద్దిరెడ్డి చిరకాల రాజకీయ ప్రత్యర్ది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సారి రాజంపేట నుంచి పోటీ చేస్తున్నారు. సోదరుడు కిషోర్ పీలేరు నుంచి బరిలో ఉన్నారు. అక్కడ కొత్త రాజకీయం మొదలైంది.
హోరా హోరీ పోరు
మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో చంద్రబాబు టార్గెట్ గా దాదాపు నాలుగేళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఓడించారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ వైసీపీ అభ్యర్ది భరత్ కు అండగా నిలుస్తున్నారు. ఇటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట నుంచి మూడోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన వైసీపీ గోదావరి జిల్లాల ఇంఛార్జ్ గా ఉన్నారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం లోనూ ప్రత్యేకంగా ఆపరేషన్ ప్రారంభించారు. దీంతో..ఇప్పుడు మూడు పార్టీల కూటమి ముఖ్య నేతలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి టార్గెట్ అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు.. నల్లారి కుటుంబం నుంచి అన్నదమ్ములు పోటీలో ఉండడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
కిరణ్ వర్సస్ మిథున్
రాజంపేట పార్లమెంట్ బరిలో మాజీ సీఎం కిరణ్ వర్సస్ మిథున్ మధ్య పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. అదే సమయంలో పీలేరు నుంచి టీడీపీ నుంచి పోటీలో ఉన్న కిషోర్ రెడ్డితో పాటుగా ఎంపీగా కిరణ్ ను ఓడించే లక్ష్యంతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ వ్యూహాలు సిద్దం చేస్తోంది. పెద్దిరెడ్డిని రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఆత్మరక్షణలోకి నెట్టటం ద్వారా చిత్తూరు జిల్లాలో పట్టు సాధించాలనేది కూటమి నేతల వ్యూహం.
అయితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి మాత్రం నల్లారి బ్రదర్స్ ను ఓడించి తీరుతామని చెబుతున్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డి - నల్లారి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన రాజంపేట పార్లమెంటు కూటమి అభ్యర్థి మాజీ సీఎం కిరణ్ ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
కలిసొచ్చేదెవరికి
నల్లారి - పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య కాంగ్రెస్ లోనే ఇద్దరూ కొనసాగుతున్న సమయం నుంచి ప్రచ్ఛన్న యుద్దం కొనసాగేది. కిరణ్ సీఎం అయిన తరువాత పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైసీపీలోకి వచ్చింది. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస లో చేరిన కిరణ్, వెంటనే బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ ఎంపీగా బరిలో ఉన్న కిరణ్ నేరుగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ..దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తు్నారు.
దీనికి ప్రతిగా రాష్ట్ర విభజనకు కారణం కిరణ్ అంటూ పెద్దిరెడ్డి కౌంటర్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కుప్పంతో పాటుగా రాజంపేట పార్లమెంట్, పీలేరు స్థానాల్లో ఈ సారి ఎన్నికల సమరం..తుది ఫలితం పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications