జూన్22 ఏం జరగబోతుంది?: విశాఖలో బిగ్ పొలిటికల్ ఫైట్.. వైసీపీ వర్సెస్ టీడీపీ!

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: టీడీపీని ఎలాగైనా దోషిగా నిలబెట్టాలని వైసీపీ చేస్తున్న వరుస ప్రయత్నాలన్ని తొలి నుంచి విఫలమవుతూనే వస్తున్నాయి. కాల్ మనీ, ఓటుకు నోటు, బలవంతపు భూసేకరణ, రెవెన్యూ అధికారిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి ఉదంతాల్లో ఈ విషయం స్పష్టమైంది. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో ఆ పార్టీ పూర్తిగా తేలిపోతూ వస్తోంది.

ఇన్నాళ్ల తర్వాత మళ్లీ విశాఖ భూఆక్రమణల కేసు ఇప్పుడు వైసీపీకి మరో అస్త్రంగా దొరికింది. ఈసారైనా ప్రభుత్వాన్ని జనం ముందు దోషిగా నిలబెట్టి.. పార్టీ మైలేజీ పెంచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం జూన్ 22న విశాఖలో మహాధర్నా చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. కానీ అదే రోజు టీడీపీ సైతం మహాసంకల్ప కార్యక్రమానికి సిద్దమవుతుండటంతో.. ఎవరిది పైచేయి అవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మహాధర్నా సక్సెస్ అవుతుందా?

మహాధర్నా సక్సెస్ అవుతుందా?

ప్రత్యేక హోదా ఉద్యమం కోసం జగన్ గతంలో విశాఖకు వచ్చిన సమయంలో పోలీసులు ఆయన్ను అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా జగన్‌కు ప్రతికూల వాతావరణమే కనిపిస్తుండటంతో మహాధర్నా ఎంతమేర సక్సెస్ అవుతుందనేది అనుమానమే. అసలు ఆయన్ను ఎయిర్ పోర్టు నుంచి నగరంలోకి అడుగుపెట్టానిస్తారా? అన్నది అనుమానమే. మరోవైపు వైసీపీ మాత్రం మహాధర్నా కోసం భారీ జన సమీకరణకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ మహాసంకల్పం:

వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ మహాసంకల్పం:

అదే సమయంలో అటు టీడీపీ సైతం వైసీపీ ధర్నాను దెబ్బతీసేందుకు భారీ ఎత్తున మహాసంకల్ప కార్యక్రమం చేపట్టబోతుంది. సహజంగానే దీనికి పోలీసుల మద్దతు ఉంటుంది కాబట్టి.. అదే రోజు తలపెట్టిన జగన్ ధర్నాకు అనుమతినివ్వడం కష్టమే. పైపెచ్చు రెండు పార్టీలు ఒకేరోజు భారీ జన సమీకరణతో సభలు, ధర్నాలు నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం లేకపోలేదు. దీంతో జూన్ 22న విశాఖ నగరంలో భారీ పొలిటికల్ ఫైట్ తప్పదన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ అసత్యాలను ఎండగట్టేందుకే:

వైసీపీ అసత్యాలను ఎండగట్టేందుకే:

విశాఖపట్నం సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ దీనిపై స్పందించారు. ప్రజల్లో అసత్యాలు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ తీరుకు చెక్ పెట్టడానికే మహాసంకల్ప సభను చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు టీడీపీ వైఖరి మీద వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కేవలం భూఆక్రమణల వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే.. టీడీపీ మహాసంకల్ప సభకు సిద్దమవుతోందని వారు ఆరోపిస్తున్నారు.

రాజకీయాంశంగా మార్చేస్తున్నారు

రాజకీయాంశంగా మార్చేస్తున్నారు

భూములను కోల్పోయిన సామాన్యులంతా తీవ్ర ఆవేదనలో ఉంటే.. దీన్నో పొలిటికల్ అంశంగా మార్చేసి రెండు పార్టీలు తగాదా పడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. భూఆక్రమణల వ్యవహారంలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సింది పోయి.. తమ పొలిటికల్ మైలేజీ కోసం ఇలా బాహాబాహికి దిగడాన్ని వారు తప్పుపడుతున్నారు. కేవలం ఒక్కరోజు కార్యక్రమాలతో సరిపెట్టి.. ప్రజలకు ఏం మేలు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is big political fight in Vizag city on June 22nd. Both ruling and opposition parties are readied to make their programs.
Please Wait while comments are loading...