విజయ్ పై అప్పర్ హ్యాండ్: రాజ్యసభ సీటు త్యాగం
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తన వాటాగా దక్కిన రాజ్యసభ స్థానాన్ని త్యాగం చేసింది. దీన్ని మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే టీవీకే అధికారిక ప్రకటన విడుదల చేసింది. మిత్రధర్మంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. మొదటిసారిగా పార్లమెంట్ లో అడుగు పెట్టే అవకాశాన్ని వదులుకున్నట్టయిందా పార్టీకి.
ఈ స్థానం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్ చక్రవర్తికి దక్కనుందని ఊహాగానాలు ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు టీవీకే, కాంగ్రెస్ పొత్తును ఆయన బలంగా సమర్థించారు. మాస్ హీరోగా విజయ్ కు ఆయన పెద్ద ఫ్యాన్ కూడా. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ సీట్ల పంపకాల చర్చలకు సిద్ధమవుతున్న సమయంలో ప్రవీణ్ చక్రవర్తి.. విజయ్‌ను ఆయన నివాసంలో కలిశారు. డీఎంకేతో పొత్తులో ఉన్నప్పుడు ఆయన చేసిన ఈ ప్రయత్నాలు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి.

గత డీఎంకే ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ ఇప్పటికే ఒక రాజ్యసభ సీటును దక్కించుకుంది. డీఎంకేతో బంధాలు తెంచుకుని టీవీకేతో చేతులు కలపాలనే ప్రతిపాదనలు వచ్చినప్పుడు కూడా రాజ్యసభ సీటును టీవీకే ముందు పెట్టింది కాంగ్రెస్. ఈ క్రమంలో సీట్ల చర్చల్లో లాభపడింది. డీఎంకే నుండి 28 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు తీసుకుంది. ఇప్పుడు తాజాగా టీవీకేతో ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం.. మరో రాజ్యసభ స్థానాన్ని కూడా బోనస్ గా దక్కించుకున్నట్టయింది కాంగ్రెస్ పార్టీకి.
ఏఐఏడీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం తన సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఖాళీ అది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మైలం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఖాళీ ఏర్పడింద. 107 మంది సొంత ఎమ్మెల్యేలు, మిత్రపక్ష మద్దతుతో టీవీకే ఈ స్థానాన్ని సులభంగా గెలుచుకోగలదు. అయినప్పటికీ- మిత్రధర్మంలో భాగంగా దీన్ని కాంగ్రెస్ కు వదలుకుంది.
తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లలో అయిదింటిని మాత్రమే గెలుచుకుంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో ఈ అయిదు స్థానాలు గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అయ్యాయి. టీవీకే మద్దతు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. పీ విశ్వనాథన్, ఎస్ రాజేష్ కుమార్ మంత్రులు కూడా అయ్యారు. ఇప్పుడు టీవీకే నుండి మరో రాజ్యసభ సీటు పొందడంతో ఆ పార్టీ మరింత లాభపడినట్టయింది.












Click it and Unblock the Notifications