పిన్నెల్లి సోదరులకు బిగ్ రిలీఫ్..! సుప్రీం కీలక ఆదేశాలు..!
ఏపీలో వైసీపీ పల్నాడు నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది. టీడీపీ నేతల జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్ కోసం వీరు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టు ఖాయమని అంతా భావించారు. అయితే అనూహ్యంగా సుప్రీంకోర్టు ఇవాళ దానికి బ్రేక్ వేసింది.
పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం రేపిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణారెడ్డిని ఏ6గానూ, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని ఏ7గానూ పోలీసులు చేర్చారు.

ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే వీరిద్దరినీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారించాలని హైకోర్టుకు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. ఈ దశలో వీరికి బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని గత వారం పీపీ వాదించారు. దీంతో హైకోర్టు వీరికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీనిపై వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

అదే సమయంలో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర పభుత్వం, ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరు ఇచ్చే వివరణల ఆధారంగా సుప్రీంకోర్టు ఈ కేసులో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం పిన్నెల్లి సోదరులకు అరెస్టు నుంచి ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications