YS Avinash Reddy: ఎన్నికల వేళ వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ ఊరట..!
ఏపీలో మరోసారి కడప లోక్ సభ సీటు నుంచి ఎంపీీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ పై ఉన్న అవినాష్ కు ఇవాళ మరోసారి హైకోర్టులో ఉపశమనం లభించింది.
ఆయనకు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఇదే కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది.

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా చేరుస్తూ గతంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. ఆయన విచారణకు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. అయితే ఆ తర్వాత వివేకా కుమార్తె సునీత దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో అవినాష్ రెడ్డి సాక్ష్యుల్ని, తనను బెదిరిస్తున్నారన్న కారణం చూపుతూ ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.
దస్తగిరి పిటిషన్ పై విచారణ జరిపి అవినాష్ బెయిల్ రద్దు చేసేందుకు నిరాకరించిన హైకోర్టు... ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య కారణాలతో తనకు బెయిల్ ఇవ్వాలంటూ భాస్కర్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ మేరకు అంగీకరించింది. అయితే ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను మాత్రం హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఎన్నికల వేళ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications