అమరావతిపై జగన్ సర్కార్ కు మరో షాక్- జీవో 316 నిలిపేసిన హైకోర్టు-ప్లాట్లు వెనక్కి తీసుకోకుండా
అమరావతిలో జగన్ సర్కార్ వర్సెస్ రైతులుగా సాగిపోతున్న పోరులో ఇవాళ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. అసైన్డ్ భూముల్లో అక్రమాల పేరిట ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. అసైన్డ్ భూముల్లో గతంలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లను వెనక్కి తీసుకుంటూ వైసీపీ సర్కార్ ఇచ్చిన నోటీసుల్ని నిలిపేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ తర్వాత జగన్ సర్కార్ కు ఈ ప్రాంతంలో తగిలిన రెండో ఎదురుదెబ్బగా దీన్ని భావిస్తున్నారు.

అమరావతిలో మరో ఝలక్
ఏపీ ప్రస్తుత రాజధాని అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అసైన్డ్ భూముల అక్రమాలను తవ్వితీసే క్రమంలో జగన్ సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. గతంలో తమ భూములు అమ్ముకున్న అసైన్డ్ రైతులకు రాజధాని ఒప్పందంలో భాగంగా ఇచ్చిన ఫ్లాట్లను వెనక్కి తీసుకోవాలని జీవో జారీ చేసింది. దీంతో మిగతా రైతులంతా తమకు ఇచ్చిన ఫ్లాట్లు అనుభవిస్తుండగా.. అసైన్డ్ రైతులు మాత్రం ఫ్లాట్లు వెనక్కి ఇవ్వాల్సిన పరిస్దితి ఎదురైంది. దీనిపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన హైకోర్టు ఇవాళ జగన్ సర్కార్ కు షాకిచ్చింది.

ఫ్లాట్లు వెనక్కివ్వాలంటూ నోటీసులు
అమరావతిలో గతంలో అసైన్డ్ భూముల రైతులు తమకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్ని రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో వీరికి అప్పటి టీడీపీ సర్కార్.. మిగతా రైతులతో సమానంగా ఫ్లాట్లు ఇవ్వాలని నిర్ణయించింది. వీరిలో చాలా మందికి ఫ్లాట్ల కేటాయింపు కూడా పూర్తయింది. అయితే అసైన్డ్ భూముల అక్రమాలు ఎప్పుడైతే తెరపైకి వచ్చాయో అప్పుడే వైసీపీ సర్కార్ వీటిపై కొరడా ఝళిపించడం మొదలుపెట్టింది. అసైన్డ్ భూముల్ని టీడీపీ నేతలకు అమ్ముకోవడం తప్పంటూ వీరికి అప్పట్లో ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్లను వెనక్కి ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేయడం మొదలుపెట్టింది. దీంతో అసైన్డ్ రైతుల్లో ఆందోళన మొదలైంది. చివరికి ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.

రైతుల ఫ్లాట్లపై హైకోర్టు విచారణ
అసైన్డ్ భూములు కలిగిన రైతులు తమ భూముల్ని రాజధాని వచ్చే సమయంలో అమ్ముకోవడంతో వీరికి ప్రభుత్వం ఇచ్చే ఫ్లాట్లు పొందేందుకు అర్హత లేదంటూ వైసీపీ సర్కార్ జీవో నంబర్ 316 ప్రకారం నోటీసులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది. అసైన్డ్ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లను వెనక్కి తీసుకోవడం చెల్లదని దాఖలైన పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు హైకోర్టు విన్న తర్వాత కీలక ఆదేశాలు వెలువరించింది. రాజధాని కోసం భూములిచ్చిన అసైన్డ్ రైతులకు జీవో నంబర్ 41 ప్రకారం గత టీడీపీ ప్రభుత్వం ప్యాకేజీ రూపంలో వీరికి ఫ్లాట్లు కేటాయించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాలు తెలిపారు.
Recommended Video

జీవో 316పై జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్
అమరావతిలో అసైన్డ్ భూములు కలిగిన రైతులు వాటిని రాజధాని నిర్మాణం సందర్భంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో నంబర్ 41 ద్వారా ఇచ్చిన ఫ్లాట్లను వైసీపీ సర్కార్ వెనక్కి తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దీనిపై వైసీపీ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 316 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాలు తెలిపినా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకే హైకోర్టు మొగ్గు చూపింది. దీంతో ఈ జీవో విషయంలో తదుపరి చర్యలేవీ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిలువరిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే అమరావతిలో పలు ఎదురుదెబ్బలు తిన్న జగన్ సర్కార్ కు హైకోర్టు తాజా ఆదేశాలు మరో షాక్ గా మిగిలాయి.












Click it and Unblock the Notifications