గండికోట వైష్ణవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యుల హస్తం..?
కడప జిల్లాలో యువతి వైష్ణవి హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక వైష్ణవి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లిన వైష్ణవి శవమై కనిపించింది. గండికోటలో ఒంటిపై దుస్తులు లేకుండా వైష్ణవి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, వైష్ణవి, లోకేష్ అనే యువకుడితో సన్నిహితంగా ఉన్నట్లు, వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. అయితే, ఏం జరిగిందో తెలియదు కానీ, వైష్ణవి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. యువతి చనిపోయిన రోజు వైష్ణవి లోకేష్‌తో కలిసి బైక్ మీద వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కొంత సమయం తర్వాత అతను ఒక్కడే తిరిగి బైక్ వెళ్లడంతో లోకేషే వైష్ణవిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు.

దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ హత్య లోకేష్ చేయలేదని పోలీసులు తేల్చేశారు. వైష్ణవిని తాను తీసుకెళ్లిన విషయం వారి ఇంట్లో తెలిసిపోవడంతో, భయపడి ఆమెను అక్కడే వదిలిపెట్టి లోకేష్ వెనుతిరిగాడని పోలీసులు నిర్దారించారు. ఆ తర్వాత గండికోటకు వైష్ణవి అన్న సురేంద్ర వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.వైష్ణవి తల్లిదండ్రులు మాత్రం లోకేషే తమ కూతుర్ని హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
తనతో మాట్లాడకపోతే బ్లేడ్‌తో చేతులు కోసుకుంటానని బెదిరించి తమ కూతుర్ని లొంగదీసుకున్నాడని వైష్ణవి తల్లిదండ్రులు లోకేష్‌పై ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు వైష్ణవిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని పోలీసులు తెలిపారు. వైష్ణవి శరీరంపై దుస్తులు లేకుండా ఉండడం వల్ల అఘాయిత్యం జరిగిందని అందరూ భావించారని, అయితే అలాంటిది ఏమీ జరగలేదన్నారు. నిందితుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డీఐజీ ప్రవీణ్ పేర్కొన్నారు. వైష్ణవి హత్య కేసులో కుటుంబ సభ్యులను సైతం విచారించనున్నారు పోలీసులు. ఇది సాధారణ హత్యా..?లేదా పరువు హత్యా...? లేక ఈ హత్యలో ఏదైనా మిస్టరీ దాగుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications