టీటీడీ ఛైర్మన్ ఎంపికలో అనూహ్య ట్విస్ట్ - దక్కేదెవరికి..!?
ప్రతిష్ఠాత్మక టీటీడీ ఛైర్మన్ అయ్యేదెవరు. టీటీడీ ఛైర్మన్ గా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన సమయం నుంచి ఇప్పటి వరకు వైవీ సుబ్బారెడ్డి రెండు టర్మ్ లు పని చేసారు. ప్రస్తుతం కొత్త ఛైర్మన్, బోర్డు ఎంపిక పైన సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సుబ్బారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ సమయంలోనే ముగ్గురు పేర్లు టీటీడీ నైతన ఛైర్మన్ రేసులో ఉన్నారు. దీంతో సీఎం నిర్ణయంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.
టీటీడీ ఛైర్మన్ రేసులో : వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగిన వైవీ పదవీకాలం ఈ నెల 12తో ముగియనుంది.ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ బాధ్యతలను ప్రస్తుతం వైవీ చూస్తున్నారు. అంతేకాక తన కుమారుడిని రాజకీయంగా ప్రోత్సహించాలని సీఎంని కోరారు. సుబ్బారెడ్డి కుమారుడు విక్రమ్‌రెడ్డి భవిష్యత్తును తాను చూసుకుంటానని జగన్ చెప్పినట్లు సమాచారం.

ఇదే సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నేత..ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కి టీటీడీ ఛైర్మన్ గా పదవి ఖాయమని అందరూ భావించారు. ఈ సమయంలోనే మరో మరో ముగ్గురు నేతలు టీటీడీ ఛైర్మన్ రేసులోకి వచ్చారు. సామాజిక సమీకరణాలు..క్లీన్ ఇమేజ్ ఆధారంగా ఎంపిక జరగనుంది.
సమీకరణాలకే కీలకంగా : ఇప్పుడు మాజీ మంత్రి సిద్దా రాఘవరావు రేసులోకి వచ్చారు. టీడీపీలో మంత్రిగా..పార్టీ పదవుల్లో సుదీర్ఘ కాలం సిద్దా పని చేసారు. 2019 ఎన్నికల్లో అయిష్టంగానే పార్టీ ఆదేశం మేరకు ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో వైశ్య వర్గానికి ప్రాతినిధ్యం లేదు.
డిప్యూటీ స్పీకర్ గా వైశ్య వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి కేటాయించారు. ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ గా సిద్దాకు అవకాశం ఇవ్వాలని వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలు సీఎం జగన్ కు సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో మరో పేరు రేసులోకి వచ్చింది. టీడీపీ, జనసేన పొత్తు వేళ కాపు వర్గానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనే ప్రతిపాదనపైనా చర్చ సాగుతోంది.

ఆ ముగ్గురులో దక్కేదెవరికి : కాపు వర్గానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయిస్తే 2019 ఎన్నికల్లో పవన్ పైన పోటీ చేసి గెలిచిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేరు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తిరుపతి ఎమ్మెల్యే భూమన సైతం ఇదే అంశం పైన సీఎంతో చర్చించినట్లు సమాచారం. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా టీటీడీ ఛైర్మన్ హోదా ఆశించారు.
ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గానికే ఈ హోదా దక్కటంతో ఇతరులకు అవకాశం ఇవ్వాలనేది సీఎం నిర్ణయంగా తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు జంగా కృష్ణమూర్తి, సిద్దా రాఘవరావు, గ్రంధి శ్రీనివాస్ పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో సీఎం జగన్ తుది ఆమోద ముద్ర ఎవరికి వేస్తారనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications