మళ్లీ రగిలిన అమరావతి: బైక్ ర్యాలీల హోరు.. అరెస్టుల జోరు

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తరువాత అమరావతి ప్రాంతంలో మొదలైన నిరసనలు, ఆందోళనలు.. మళ్లీ రగిలాయి. అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తోన్న ఈ ఆందోళనలు ఇవ్వాళ్టికి 600 రోజులకు చేరుకున్నాయి. దీనితో ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు తెర తీశారు. బైక్ ర్యాలీలను నిర్వహిస్తోన్నారు. దేవస్థానం నుంచి న్యాయస్థానం పేరుతో నిర్వహించ తలపెట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవి కాస్తా అరెస్టులకు దారి తీశాయి.

మూడు రాజధానులకూ మొదటి నుంచీ..

మూడు రాజధానులకూ మొదటి నుంచీ..

రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్ సారథ్యంలోని వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తోన్న ప్రయత్నాలను అమరావతి ప్రాంత రైతులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానాల్లో వారు పోరాడుతోన్నారు. రైతుల నిరసన కార్యక్రమాలకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సారథ్యాన్ని వహిస్తోంది. మూడు రాజధానులను ఏర్పాటు చేయడాన్ని టీడీపీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా ఈ ఉద్యమాల్లో పాల్గొన్న సందర్భాలు చాలా ఉన్నాయి.

మూడు ప్రాంతాల్లో..

మూడు ప్రాంతాల్లో..

మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే వెల్లడించారు. దీనిపై నిండు అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. ఇప్పుడున్న అమరావతిలో అసెంబ్లీ, మండలిని కొనసాగిస్తూ.. అమరావతి ప్రాంతాన్ని శాసన రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అప్పట్లో ప్రకటించారు. ఉత్తరాంధ్రలోని సాగర నగరం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, అలాగే రాయలసీమలోని కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి.. దాన్ని న్యాయ రాజధానిగా మార్చాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. ఆయన ఈ ప్రకటన చేసిన వెంటనే అమరావతి ప్రాంతంలో నిరసన జ్వాలలు చెలరేగాయి.

ముందుకు కదలని ప్రక్రియ..

ముందుకు కదలని ప్రక్రియ..

నండు అసెంబ్లీలో వైఎస్ జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు రెండేళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ- ఆ ప్రక్రియ మాత్రం ముందుకు కదలట్లేదు. కర్నూలులో హైకోర్టును నిర్మించడానికి 250 ఎకరాల స్థలాన్ని జగన్నాథ గట్టు వద్ద గుర్తించడం మినహా చెప్పుకోదగ్గ ప్రయత్నాలు గానీ, పనులు గానీ ఆ దిశగా కదల్లేదు. విశాఖపట్నంలో సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలను తరలించడానికి అవసరమైన భవనాలు అందుబాటులో లేకపోవడం కూడా ఈ ప్రక్రియ జాప్యం కావడానికి ఓ కారణమనే అభిప్రాయాలు లేకపోలేదు.

న్యాయపరమైన చిక్కులు..

న్యాయపరమైన చిక్కులు..

ఇది ఒక ఎత్తయితే.. న్యాయపరమైన అడ్డంకులు మరో ఎత్తగా మారాయి. మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ అటు అమరావతి ప్రాంత రైతులు, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ కాస్తా న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీని నుంచి అధిగమించడానికి వైఎస్సార్సీపీ చేస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదు. అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, లాక్‌డౌన్ తరహా పరిస్థితులు.. ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేకులు వేసినట్టయిందని అంటున్నారు. తొలుత విశాఖపట్నానికి క్యాంప్ కార్యాలయాన్నయినా తరలించాలని భావించినా.. అదీ కూడా కొలిక్కి రావట్లేదు.

అమరావతిలో నిరసనల హోరు..

అమరావతిలో నిరసనల హోరు..

ఇదిలావుంటే- అమరావతిని పూర్తి స్థాయిలో రాజధానిగా కొనసాగింపజేయాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తోన్న నిరసన ప్రదర్శనలు ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటూ వస్తోన్నాయి. ఈ నిరసన దీక్షలు, కార్యక్రమాలు, ఆందోళనలు, ప్రదర్శనలు.. ఇవ్వాళ్టికి 600 రోజుల ల్యాండ్‌మార్క్‌ను అందుకున్నాయి. ఇంత సుదీర్ఘకాలం పాటు రైతులు నిరసన ప్రదర్శనలను నిర్వహించిన చరిత్ర లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతోన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను రద్దు చేయాలని, ఆ ప్రయత్నాలను విరమించుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.

భారీగా బైక్ ర్యాలీ..

భారీగా బైక్ ర్యాలీ..

అమరావతి నిరసన ప్రదర్శనలు 600 రోజులకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆ ప్రాంత రైతులు ఈ ఉదయం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ క్రమంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. దీనికి దేవస్థానం నుంచి న్యాయస్థానం అనే పేరు పెట్టారు. అమరావతి ప్రాంత పరిధిలోకి వచ్చే మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద ఆరంభమైన ఈ బైక్ ర్యాలీ.. వెలగపూడిలోని హైకోర్టు భవన సముదాయం వరకు కొనసాగాల్సి ఉంది. పోలీసులు ఈ ర్యాలీని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇందులో పాల్గొన్న వారిని అరస్టు చేస్తోన్నారు. ఫలితంగా- అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకూ..

ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకూ..

మూడు రాజధానుల ప్రక్రియ నుంచి ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తగ్గేంత వరకూ తమ ఉద్యమం కొనసాగి తీరుతుందంటూ అమరావతి ప్రాంత రైతులు హెచ్చరిస్తోన్నారు. వెయ్యి రోజులైనా తమ నిరసన ప్రదర్శనలను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేస్తోన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే తమ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తోన్నారు.

ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో, మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోన్నారు అమరావతి ప్రాంత రైతులతో ఏర్పాటైన ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు. అరెస్టయిన వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ వారు డిమాండ్ చేస్తోన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకూ తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+