రూ.1,000 కోట్లతో అమరావతిలో బిట్స్ కొత్త క్యాంపస్..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం అమరావతి పునర్నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రముఖ విద్యాసంస్థలు, సాంకేతిక సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు వేస్తున్నాయి.
ఇప్పుడు రాజధాని ప్రాంతంలో కొత్తగా బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు BITS Pilani ఛాన్సలర్, బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా వెల్లడించారు.

రూ.1,000 కోట్ల పెట్టుబడితో "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్" పేరుతో అమరావతిలో కొత్త క్యాంపస్ నిర్మించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్యాంపస్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేస్తూ, మొత్తం 7,000 మంది విద్యార్థులకు చోటు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును 2027 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
ఈ కొత్త క్యాంపస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇన్నోవేషన్ అండ్ స్ట్రాటజీ వంటి విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్, డాక్టరల్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చారు. మొత్తం క్యాంపస్ దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించనున్నామని బిర్లా అన్నారు. కాగా గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఈ విద్యా కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు.
ఈ కొత్త బిట్స్ ప్రాజెక్ట్‌తో పాటు ఇతర కంపెనీలు, గ్లోబల్ యూనివర్సిటీలు కూడా అమరావతిలో తమ సెంటర్లు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం విద్యారంగానికే కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి, ఉద్యోగ అవకాశాల పెంపునకు, స్టార్టప్ ఎకోసిస్టం బలపడడానికి కూడా దోహదపడనుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications