చినరాజప్పకు మిత్రపక్షం బిజెపి ఝలక్, 'నాగార్జున' వీసీ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి!
నెల్లూరు/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్పకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గురువారం నాడు ఝలక్ ఇచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ విచారణను వేగవంతం చేయాలని ఆయన కాన్వాయ్‌ను బిజెపి అడ్డుకుంది.
దీంతో, చినరాజప్ప స్పందించారు. సిఐడి విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న మరో 25 సంస్థల పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పారు.

సీఐఐ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
సీఐఐ సమావేశం హైదరాబాద్‌లో గురువారం నాడు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఐఐ ప్రతినిధులనుద్దేశించి మాట్లాడారు.
సీఐఐతో తనకు పందొమ్మిదేళ్ల అనుభవం ఉందన్నారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి సీఐఐ సహకారం అవసరమన్నారు.
ఎగుమతులు, దిగుమతుల కేంద్రంగా ఏపీని రూపొందిస్తున్నామని, నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని కరవురహితంగా మారుస్తామన్నారు. పోర్టు కార్గోలో ఏపీ మూడో స్థానంలో ఉందని చెప్పారు. అగ్రస్థానం చేరడమే తమ లక్ష్యమని చెప్పారు.
నాగార్జున వర్సిటీ ఇంఛార్జి విసిగా ఉదయలక్ష్మీ బాధ్యతల స్వీకరణ
నాగార్జున విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ వీసీగా ఐఏఎస్ అధికారిణి ఉదయలక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె ఉద్యోగులు, విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె ప్రశఅనలతో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. గంటలోగా తనకు పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు.
నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇటీవల రిషికేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ర్యాగింగ్ కోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రిన్సిపల్ పైన వేటు వేశారు. వీసీ పైన కూడా వేటు వేశారు. వీసీని తప్పించి ఆయన స్థానంలో సాంకేతిక విద్య కార్యదర్శిగా ఉన్న ఉదయలక్ష్మిని ప్రభుత్వం ఇంఛార్జి విసిగా నియమించింది.












Click it and Unblock the Notifications