బీజేపీ బీసీ మంత్రం .. తెలంగాణాలోనే కాదు ఏపీలో కూడా .. వైసీపీ, టీడీపీలకు చెక్ పెట్టేందుకే బీసీ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బిసి మంత్రాన్ని జపిస్తూ కెసిఆర్ కు వెన్నులో వణుకు పుట్టిస్తుంటే, ఇక ఏపీలోనూ బిజెపి బీసీల రాగం అందుకుంది. తాజాగా సోము వీర్రాజు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చేసిన ప్రకటన అందుకు ఊతమిస్తోంది.
బీసీని సీఎం చేస్తాం .. చంద్రబాబుకు, జగన్ కు ఆ దమ్ముందా? వలసలపై కూడా సోము వీర్రాజు సంచలనం

తెలుగురాష్ట్రాల్లో పాగా వెయ్యాలని బీజేపీ పక్కా స్కెచ్ .. 42 ఎంపీ సీట్లే లక్ష్యం
దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అధినాయకత్వం,ఆ దిశగా తెలుగు రాష్ట్రాలకు దిశానిర్దేశం చేస్తుంది. తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బిజెపి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బీసీ వర్గాల ఓటుబ్యాంకు ఎక్కువగా ఉన్న కారణంగా వారి ఓటు బ్యాంకు కొల్లగొట్టడమే లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలో 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ బలపడితే, బిజెపిని ఢీకొట్టే పార్టీ ఉండదని బలంగా నమ్ముతున్న బిజెపి అధినాయకత్వం పక్కా ప్లాన్ తో రెండు రాష్ట్రాల్లోని బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేస్తుంది.

బీసీ ఓటు బ్యాంకు కోసం ఇప్పటికే పని మొదలెట్టిన వైసీపీ , టీడీపీ .. చెక్ పెట్టే ప్రకటన చేసిన బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడం కోసం ఇప్పటికే వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీసీ కార్పొరేషన్ లను ఏర్పాటుచేసి, పెద్ద ఎత్తున బీసీలకు సంక్షేమ పథకాలను అందిస్తూ రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. మరోపక్క టీడీపీ కూడా బీసీలకు అండగా ఉండేది తామే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. అయినప్పటికీ వైసిపి రెడ్డి సామాజిక వర్గానికి, టిడిపి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీలుగా ముద్ర పడటంతో, బీసీలను ఆకట్టుకోవడానికి బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామంటూ బీజేపీ ఇప్పుడు బీసీల దృష్టిని ఆకర్షించే పనిలో పడింది.

బీసీ కార్డుతో క్షేత్ర స్థాయిలోకి .. జమిలి ఎన్నికలకు అదే టార్గెట్
గతంలో కన్నా లక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా బీసీ కార్డును బాగానే వాడేశారు. ఇక ఇప్పుడు సోము వీర్రాజు ఇంకో అడుగు ముందుకు వేసి బీసీ ని సీఎం చేస్తామంటూ ప్రకటించారు. టీడీపీ, వైసీపీలకు బీసీని సీఎం చేసే సత్తా ఉందా అంటూ సవాల్ విసిరారు.2023 లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందని ఈ నేపథ్యంలోనే ప్రధానంగా బీసీలను దృష్టిలో పెట్టుకొని బీసీ కార్డుతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్లుగా సమాచారం.

తెలంగాణలో కేసీఆర్ ను వణికిస్తున్న బీజేపీ బీసీ మంత్రం .. ఇప్పుడు ఏపీలో బీసీ సీఎం అంటూ సంచలనం
అందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కి , కెసిఆర్ కు బీసీ మంత్రం జపిస్తున్న బిజెపి వణుకు పుట్టిస్తుంటే, తాజాగా ఏపీ కూడా అదే బాటలో బీసీలకు పట్టం కడతామని ప్రకటన చేసి టిడిపిని, వైసీపీని టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అటు వైసీపీ ,టీడీపీల పై ప్రజల్లో ఉన్న అసహనాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో బిజెపి ఉంది . అందులో భాగంగానే వచ్చే ఎన్నికల లోపు బలమైన పార్టీగా వైసీపీని ఢీ కొట్టాలని స్కెచ్ వేసింది. అందుకే బీసీ ని సీఎం చేస్తామంటూ సంచలన ప్రకటన చేసి ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించింది.