టీడీపీతో పొత్తుపై బీజేపీ సంకేతాలు - కండీషన్స్ అప్లై, 2014 రిపీట్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయంలో కీలక మలుపు. ఏపీలో పొత్తుల పైన బీజేపీలో కదలిక వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ లక్ష్యం. ఈ క్రమంలో కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పటికే టీడీపీతో జత కట్టారు. బీజేపీ తమతో కలిసి రావాలని కోరుతున్నారు. ఈ సమయంలోనే బీజేపీ ఢిల్లీ నేతల నుంచి పొత్తు పైన తాజా సంకేతాలు అందుతున్నాయి. కొన్ని షరతులు పెడుతున్నారు.
ఏపీలో పొత్తు రాజకీయం: ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. 2014 తరహా పొత్తులు మరో సారి తెర పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీలో జగన్ ను ఓడించటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో వెళ్తున్నాయి. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన తమ రెండు పార్టీలతో ఏపీలో కలిసి రావాలని బీజేపీకి ప్రతిపాదించారు.

ఇప్పటి వరకు బీజేపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. సంక్రాంతి వరకు వేచి చూసి తమ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు - పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ఏపీలో పొత్తుల పైన బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తుల పైన క్షేత్ర స్థాయి సమాచారంతో నివేదిక ఇవ్వాలని బాధ్యతలను హైకమాండ్ ముగ్గురు బీజేపీ జాతీయ నేతలకు అప్పగించింది.
సీట్లపై షరతులు: బీజేపీ ఏపీ ముఖ్య నేతల నుంచి సమాచారం సేకరించారు. బీజేపీ, జనసేనతో కలిసి వెళ్లాలని కొందరు సూచించగా.. తెలంగాణ తరహాలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూ సొంతంగా ఎదిగేలా వ్యూహం ఉండాలని సూచించారు. ఏపీ నుంచి అసెంబ్లీ, లోక్ సభలో పార్టీకి ప్రాతినిధ్యం దక్కాలంటే పొత్తులు అవసరమని మరి కొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
దీంతో..ప్రాధమికంగా జరిగిన చర్చల్లో పొత్తులో భాగంగా తమకు దక్కే సీట్ల గురించి చర్చ చేస్తన్నట్లు సమాచారం. 8 లోక్ సభ, 12 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బీజేపీ నుంచి టీడీపీకి ప్రతిపాదన అందిందని చెబుతున్నారు. సీట్ల పైన ముందుకు వస్తే పొత్తు పైన పార్టీ అధినాయకత్వం వద్ద తుది నిర్ణయం తీసుకుంటామని సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.

ప్రధాని చేతిలో నిర్ణయం: పార్టీ కమిటీ ఇచ్చిన నివేదిక పైన జనవరి తొలి వారంలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీ నుంచి సీట్ల పైన క్లారిటీ వస్తే పొత్తు విషయంలో ప్రధాని తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఏపీ విషయంలో..చంద్రబాబు, జగన్ తో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనేది ప్రధాని నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణలో తాజా ఎన్నికల్లో సొంతంగా వెళ్లటం ద్వారా సీట్లు, ఓట్లు పెరిగిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. దీంతో..జనవరి తొలి వారంలో పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలో పొత్తుల పైన బీజేపీ వైఖరి ఏంటనేది స్పష్టత రానుంది. సంక్రాంతికి బీజేపీ నుంచి సానుకూల స్పందన వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications