పవన్‌కళ్యాణ్‌పై బీజేపీ స్కెచ్: బాబుకు చిక్కు, చిరుకు చెక్! కేసీఆర్‌తో..
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలుగు రాష్ట్రాల పైన దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆయన గురు, శుక్రవారాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యటించనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఉత్తరాదిన విజయఢంకా మోగించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు మినహాయించి మోడీ హవాతో బీజేపీ సత్తా చాటింది.
అయితే, తెలంగాణలో రాష్ట్ర విభజన నేపథ్యంలో తెరాస ఎక్కువ స్థానాలలో గెలిచింది. ఏపీలో పొత్తు కారణంగా టీడీపీ - బీజేపీలు కలిసి సీట్లు పంచుకోవాల్సి వచ్చింది. 2014లో యూపీలో గెలిచినట్లుగా 73 లోకసభ స్థానాలు, మోడీ ప్రభంజనం తగ్గవచ్చు. దీనిని ముందుగానే గుర్తించిన అమిత్ షా.. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల పైన దృష్టి సారించింది.
ఆ కారణంగానే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. 2019లో కూడా బీజేపీ ఢిల్లీ పీఠం ఎక్కాలంటే ఉత్తరాది పైనే పూర్తిగా భారం వేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ పటిష్టంగా లేని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల పైన కూడా అమిత్ షా దృష్టి సారించారు.

ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా 20 లక్షల మెంబర్ షిప్ టార్గెట్ పెట్టినట్లుగా తెలుస్తోంది. బీజేపీ సహకారంతోనే తెలంగాణ వచ్చిందని, అలాగే, తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అమిత్ షా మరోసారి సూచించనున్నారు.
తెలంగాణలో ఏం చేయాలనే విషయం వారితో చర్చించనున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనందున ఇటీవలి వరకు కొంత దూకుడు ప్రదర్శించిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రంతో దోస్తీ దిశగా సాగుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్యారలల్‌గా వెళ్తూ, తెలంగాణలో బీజేపీని బలపర్చే దిశగా అమిత్ షా ఉద్బోద చేయనున్నారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోను పార్టీ బలోపేతం పైన బీజేపీ చీఫ్ దృష్టి సారించారు. టీడీపీతో దోస్తీ కొనసాగిస్తూనే.. మిగతా పార్టీలలో కీలకంగా ఉన్న నేతలు తమ వైపుకు వస్తే చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణ చాలా రోజుల క్రితమే కమలం తీర్థం పుచ్చుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నేడే రేపో చేరుతారంటున్నారు. ఏపీ నుండి బీజేపీలో చేరేందుకు పెద్ద క్యూనే ఉందని చెబుతున్నారు.
బీజేపీ ఎదుగుదల టీడీపీకి ఇబ్బందికర పరిణామమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో రెండున్నర దశాబ్దాలుగా శివసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఇటీవల ఎన్నికల్లో పొత్తు కుదరక ఒంటరిగా పోటీ చేసి శివసేనను తమ దారికి తెచ్చుకుంది. బీజేపీ ఎదుగుదల టీడీపీకి ఇబ్బందికర పరిణామమే అంటున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. ఇప్పటి వరకు పవన్ ప్రధాని మోడీ పాలన పైన ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పైగా బాగుందని కొద్ది రోజుల క్రితం కితాబిచ్చారు. పవన్‌ను వదులుకునేందుకు బీజేపీ కూడా సిద్ధంగా లేదు. ఆయన స్థాపించిన జనసేనని బీజేపీలో విలీనం చేయించుకునేందుకు ప్రయత్నాలు జరిగినట్లుగా గతంలో ప్రచారం జరిగింది.
విలీనం కాకపోయినా పవన్ కళ్యాణ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎదిగేందుకు బీజేపీ స్కెచ్ వేస్తోందని అంటున్నారు. తమిళనాట రజనీకాంత్, విజయ్ తదితర హీరోల వైపు బీజేపీ చూసిన విషయం తెలిసిందే. తెలుగు నాట పవన్ ఇమేజ్ తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్న బీజేపీ ఆయనను వదులుకునేందుకు సిద్దపడకపోవచ్చు. పార్టీ ఎదుగుదల కోసం ఇక నుండి పవన్‌ను మరింత ఉపయోగించుకోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
పవన్ కూడా పార్టీ కార్యాచరణ పైన దృష్టి సారించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే, తన పార్టీ పైన దృష్టి పెట్టనున్న పవన్ బీజేపీ పాలనను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటారా? కమలం వైపే ఉంటారా అనేది చూడాలి. అమిత్ షా తన ఈ పర్యటనలో బీజేపీ నేతలతో పవన్ అంశం పైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చిరంజీవి ఉన్న కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడమే కాకుండా, 2019 నాటికి కీలకంగా ఎదిగే అంశంపై షా దృష్టి పెడుతున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications