వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబును కార్నర్ చేసిన కేంద్రం: ఎపిలో కమలం ఆశలు గల్లంతేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కార్నర్ చేసింది. ప్రత్యేక హోదాపై చేతులెత్తేయడమే కాకుండా రెవెన్యూ లోటు భర్తీ చేసేది కూడా లేదని కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా చంద్రబాబు ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది.

ఇంతకాలం చంద్రబాబు కేంద్ర సాయం తప్పకుండా అందుతుందని ఆశిస్తూ రావడమే కాకుండా అదే ఆశను ప్రజల్లోనూ కల్పిస్తూ వచ్చారు. తీరా కేంద్రం చేతులెత్తేయడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో చంద్రబాబు పడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చేజేతులా చంద్రబాబుపై ప్రయోగించేందుకు తగిన అస్త్రాన్ని కేంద్రం అందించినట్లయింది.

అదే సమయంలో ఎపిలో బలం పుంజుకుందామని ఆశిస్తూ వస్తున్న బిజెపి నేతల కాళ్లకు బంధాలు పడ్డాయి. బిజెపిపై ఆశతో కాంగ్రెసుకు చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మినారాయణ వంటి సీనియర్ నేతలు ఆ పార్టీలో చేరారు. చంద్రబాబును చిక్కుల్లో పడేస్తూ అవకాశం తీసుకుని పార్టీని బలోపేతం చేస్తూ తాము బలపడుదామని అనుకుంటూ వచ్చారు.

BJP corners Chandrababu Naidu on special status

కానీ, కేంద్రం ప్రకటనతో వారు ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలనే విషయంపై సందిగ్ధంలో పడ్డారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ అంశాలను దాటేసి వారు ఎపికి కేంద్రం అందించే సాయంపై మాట్లాడే పరిస్థితి ఉండదు. ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలేమిటో, ప్రత్యేక ప్యాకేజీకీ దానికీ మధ్య ఉండే తేడా ఏమిటో జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పటికి వివరించి ఉన్నారు.

బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ లక్ష్యం చేసుకోరనే విషయం గతాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆయన చంద్రబాబు నాయుడినే లక్ష్యం చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి వర్గం నుంచి టిడిపి తప్పుకోవాలనేది ఆయన ప్రధాన డిమాండ్ అవుతుంది. అదే సమయంలో కేంద్రంపై పోరుకు కలిసి రావాలని ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ చంద్రబాబుకు పిలుపునిచ్చారు.

సాహసం చేసి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు దిగుతారనే నమ్మకం లేకపోవడం వల్లనే బొత్స సత్యనారాయణ ఆ పిలుపునిచ్చారని అనుకోవచ్చు. అది చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికి చేసిన ప్రయత్నమే తప్ప మరోటి కాదు. కేంద్రంపై చంద్రబాబే కాదు, జగన్ కూడా పోరాటం చేయలేని స్థితిలోనే ఉన్నారు.

ఎపిలో రాజకీయాలు మాత్రమే ప్రధానంగా మారాయి. చంద్రబాబు, జగన్ పరస్పరం ఒకరిపై మరొకరు రాజకీయంగా ఆధిపత్యం సంపాదించుకోవడానికి మాత్రమే సమస్యలను వాడుకుంటున్నారు. కేంద్రం అండదండలతో నెట్టుకురావాలనే చంద్రబాబు ప్రయత్నాలకు దాదాపుగా గండి పడిన స్థితిలో జగన్ నుంచి ఆయన తీవ్రమైన విమర్శలను ఎదుర్కునే అవకాశం ఉంది. కాగా, బిజెపి భవిష్యత్తు కూడా ఎపిలో ప్రశ్నార్థకమవుతుందని అంటున్నారు.

English summary
PM Narendra Modi's government cornered Andhra Pradesh CM and Telugu Desam party (TDP) chief Nara Chandrababu Naidu on special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X