కోడికత్తి సినిమా స్క్రిప్టు కేంద్రానిదే..! దర్శకుడు మోదీ..!! లోకేష్ ఘాటు విమర్శలు..!!
అమరావతి/ హైదరాబాద్ : ఏపి ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చిన మోడీ హోదా ఇవ్వకుండా ఏపీకి వెన్నుపోటు పొడిచారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. అన్నిరంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన కుట్రలు, కుతంత్రాలు కూడా ఏమీ చేయలేకపోవడంతోనే తనపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. జన్మభూమి సభలో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం ముష్టికుంట్ల గ్రామం వచ్చిన మంత్రి, ప్రధాని మోడీ తనపై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగానే సమాధానం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌కి మోడీ వెన్నుపోటు..! మంత్రి లోకేష్ ఆరోపణ..!!
ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ప్రగతి మార్గంలో పయనింపజేయడమే నేను చేసిన నేరమా? అని నిలదీశారు. ప్రధాని మోడీ అధికారంలోకొచ్చేటప్పుడు అవినీతిపరుల భరతం పడతానని ప్రగల్భాలు పలికారని, అయితే అవినీతిపరుల్ని తన చంకనెక్కించుకుని అభివృద్ధికారకులను లక్ష్యంగా దాడులు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. మోడీ అవినీతిపరుల్ని అరెస్ట్ చేయాలంటే..దొంగబ్బాయి ఆయన పక్కనే ఉన్నాడని ..ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అన్నిరంగాల్లో అభివృద్ది పథంలో పయనిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ని ఎలాగైనా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో తనపైనా, సీఎం చంద్రబాబుపైనా లేనిపోని ఆరోపణలు చేస్తూ..కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ప్రధానిపై మంత్రి నారా లోకేష్ ఎదురుదాడి..! ఏపి కి ఏం చేసారో చెప్పాలని ప్రశ్న..!!
సీఎం చంద్రబాబుని రోజూ తిట్టే జగన్ ఆంధ్రప్రదేశ్‌కి అడుగడుగునా అన్యాయం చేస్తున్న మోడీని పల్లెత్తుమాట కూడా ఎందుకు అనడని ప్రశ్నించారు. ``అసెంబ్లీకి తాను రాకుండా, తన పార్టీ ఎమ్మెల్యేలను రానివ్వని దొంగబ్బాయి, ఠంచనుగా జీతాలు, అలవెన్సులు మాత్రం తీసుకుంటున్నారని ఎద్దేవ చేశారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే పని మానేసి..డ్రామాలాడుతున్నారని విమర్శించారు. మొన్నటివరకూ ప్రత్యేక హోదా కోసమంటూ రాజీనామా నాటకం రక్తి కట్టించగా, మోడీ ఇంట్లో విజయసాయిరెడ్డి కనిపించడంతో ఇది రాజీనామా కాదు.. రాజీడ్రామా అని ప్రజలకు తెలియడంతో మరో కొత్త నాటకానికి తెరలేపారని ఎద్దేవ చేశారు.

రక్తి కట్టని కోడి కత్తి డ్రామా..! మోదీ దర్శకత్వం ఫ్లాఫ్ అయ్యిందన్న లోకేష్..!!
లేని సానుభూతి రప్పించుకునేందుకు కోడికత్తి డ్రామా ఆడితే...చివరికి ఆ కత్తి వీరుడు వైసీపీ కార్యకర్తే అని తేలడంతో...తమను ఆడిస్తున్న ఢిల్లీ మోడీషాల నేతృత్వంలో కోడికత్తి కేసును ఎన్ఐఏకి అప్పగించడం వెనుక కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాల పేరుతో ఏపీలో చిచ్చు రగిలించేందుకు దొంగబ్బాయి ఢిల్లీ పెద్దలతో కలిసి పన్నుతున్న కుట్రలు, తెలుగువారి ఐక్యత ముందు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు పోరాడితే కేసులు, ఐటీ,ఈడీ దాడులతో బెదిరిస్తున్నారని, ఇటువంటి దాడులకు బెదిరే ప్రసక్తే లేదన్నారు.

25 ఎంపీ సీట్లు గెలుస్తాం..! ప్రధానిని చంద్రబాబే ఎంపిక చేస్తారని జోష్యం చెప్పిన లోకేష్..!!
వచ్చే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ నేతలు కలిసి ఓట్లడిగేందుకు వస్తారని..వారిని సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టి...ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారని నిలదీయాలని లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీలో 25 ఎంపీ సీట్లు తెలుగుదేశం గెలుచుకునేలా మీరంతా కృషి చేస్తే ..దేశప్రధానిని మన సీఎం చంద్రబాబే ఎంపిక చేసి.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ సాధిస్తారని చెప్పారు. వేలాది మంది కార్యకర్తలు సభ పూర్తయ్యేవరకూ ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించినందుకు ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు అంటూ మంత్రి నారా లోకేష్ తన ప్రసంగాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications