కన్నా రాజీనామాపై బీజేపీ రియాక్షన్- సోముకు మద్దతు-రాజకీయ దురుద్దేశంతోనేనన్న జీవీఎల్..
కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపై బీజేపీ స్పందించింది. కన్నా చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టిన పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. రాజకీయ దురుద్దేశంలో భాగంగానే ఇవి చేశారన్నారు.
బీజేపీకి పార్టీ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమర్పించిన రాజీనామా కలకలం రేపుతోంది. పార్టీలో అంతర్గత పోరు నేపథ్యంలో బీజేపీకి గుడ్ బై చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ.. అందుకు గల కారణాల్ని కూడా బయటపెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దీనిపై స్పందించారు.
బీజేపీ హైకమాండ్ కు కన్నా లక్ష్మీనారాయణ ఫ్యాక్స్ ద్వారా పంపిన రాజీనామా లేఖ అందింది. దీంతో ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రెస్ మీట్ పెట్టారు. అంతకు ముందు కన్నా రాజీనామా వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుటుందని చెప్పిన జీవీఎల్.. కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టారు. అధిష్టానంతో మాట్లాడిన తర్వాతే ఈ వివరాలు వెల్లడిస్తున్నట్లు ప్రకటించిన జీవీఎల్.. కన్నా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎంపీ జీవీఎల్ తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే కన్నా వ్యాఖ్యలు చేశారన్నారు. సోముపై కన్నా వ్యాఖ్యలు సముచితం కాదన్నారు. కన్నాకు బీజేపీ సముచిత స్ధానం ఇచ్చిందని, గతంలో బీజేపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిందని జీవీఎల్ గుర్తుచేశారు. సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షం కాదని ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలకు జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. అధిష్టానం ఆదేశాల ప్రకారమే సోము నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివని, అధిష్టానంతో సంప్రదించాకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని జీవీఎల్ తెలిపారు.












Click it and Unblock the Notifications