CM Ramesh: మనసులో మాట చెప్పేసిన సీఎం రమేష్-అక్కడి నుంచి ఎంపీగా పోటీ..!
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో పలు దఫాలుగా చర్చల తర్వాత నిన్న చంద్రబాబు ఇంట్లో మరోసారి కీలక నేతలు చర్చించారు. ఇందులో బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆరు సీట్లలో విశాఖను కూడా బీజేపీ కోరుతున్నా చంద్రబాబు మాత్రం ఇచ్చేందుకు అంగీకరించడం లేదన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత సీఎం రమేష్ స్పందించారు.
బీజేపీకి విశాఖ ఎంపీ సీటుకు బదులుగా అనకాపల్లి ఎంపీ సీటు కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఉత్తరాది ఓట్లు ఎక్కువగా ఉన్న విశాఖ లోక్ సభ సీటు కోసం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో తాను విశాఖ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు బీజేపీ మాజీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. ఇవాళ పార్టీ నేతల భేటీలో మాట్లాడుతూ విశాఖ నుంచి పోటీకి తనకు ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. అయితే అధిష్టానం ఏ సీటు కేటాయించినా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు.

మరోవైపు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుతో తాడేపల్లి కోటలు కదులుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. విపక్షాల పొత్తుతో అధికార పార్టీలో భయం కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లను విపక్షాల కూటమి కైవసం చేసుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. త్వరలో సీట్ల కేటాయింపు పూర్తయి ప్రకటన వస్తుందన్నారు. రాయలసీమలోని కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు గతంలో ఎందరో నాన్ లోకల్ లీడర్లను ఎంపీలుగా గెలిపించిన విశాఖ ఎంపీ సీటుపై కన్నేశారు.












Click it and Unblock the Notifications