‘పవన్! ఆంధ్రావాదివేనా?.. అయితే హైదరాబాద్ వదిలేయ్’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎన్నో సవాళ్లు ఎదురువుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల నేతల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తాజాగా మరోసారి బిజెపి నాయకులు పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'పవన్ కళ్యాణ్.. నీవు ఆంధ్రా వాదివా? సమైక్య వాదివా? లేక తెలంగాణా వాదివా?.. అనే విషయాన్ని ముందు తేల్చాలి' అంటూ విజయవాడ నగర బిజెపి నేతలు డిమాండ్ చేశారు.
సోమవారం బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర బీజేపీ అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వర రాజు మాట్లాడుతూ.. పవన్ నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరేవాడైతే హైదరాబాద్ నుంచి తరలి వచ్చి, విశాఖపట్నంలో సినీ పరిశ్రమ పెట్టడానికి ముందుకు రావాలని సవాల్ విసిరారు.

రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై పవన కళ్యాణ్ అవగాహన పెంచుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. వెంకయ్య నాయుడుపై పవన కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీలోని ఉపయోగాలను ఆయన అధ్యయనం చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏపీ అభివృద్థికి కట్టుబడి ఉందన్నారు.
ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు నేషనల్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఎల్‌ఆర్‌కె ప్రసాద్, మాలకొండయ్య, నగర నాయకులు అర్ముగం, రవీంద్రారెడ్డి, శ్రీరామ్, చిన్నపురెడ్డి శివనాగేశ్వరరావు, శిరీష్ కుమార్, రఘు, శ్రీనివాసరావు, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications