ఎన్టీఏ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం - బీజేపీ క్లారిటీ, రోడ్ మ్యాప్..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ తాము సింగిల్ గానే పోటీ చేస్తామని ప్రకటించారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగానే కనిపిస్తోంది. బీజేపీతోనూ కలిసి వెళ్లాలనేది చంద్రబాబు, పవన్ ఆలోచన. బీజేపీ అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. ఇదే సమయంలో పాతమిత్రులను ఆహ్వానిస్తూ ఎన్డీఏ సమావేశానికి నిర్ణయించింది. టీడీపీని ఆహ్వానించిందనే ప్రచారం సాగింది. దీని పైన బీజేపీ నేత స్పష్టత ఇచ్చారు. రోడ్ మ్యాప్ ఖరారు అయింది.
పొత్తులపై స్పష్టత వచ్చినట్లేనా : ఏపీలో పొత్తు రాజకీయాల పైన క్రమేణా స్పష్టత వస్తోంది. అధికారిక ప్రకటనలే మిగిలాయి. టీడీపీ- జనసేన పొత్తు ఖాయమని రెండు పార్టీల కేడర్ భావిస్తోంది. బీజేపీ వైఖరిని గమనిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ, అమిత్ షా తో సుదీర్ఘ భేటీలు నిర్వహించారు.

ఏపీకి వచ్చిన అమిత్ షా, నడ్డా వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసిన తరువాత జరిగిన భేటీలు కావటంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీల తరువాత బీజేపీ తమతో కలిసే అవకాశం లేదని టీడీపీ, జనసేన దాదాపు నిర్ణయానికి వచ్చాయి. ఇదే సమయంలో ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశానికి నిర్ణయించారు. పాత మిత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. టీడీపీ కూడా ఈ సమావేశానికి హాజరవుతుందంటూ ప్రచారం సాగింది.
ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరుపై : ఎన్డీఏ సమావేశానికి తమకు ఆహ్వానం లేదని..సమాచారం లేదని టీడీపీ స్పష్టం చేసింది. జనసేన మిత్రపక్షంగా ఉండటంతో పవన్ కు ఆహ్వానం అందుతుందా.. ఎన్డీఏలోకి జనసేన ఎంట్రీ ఇస్తుందా..దూరంగా ఉంటుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలోనే ఏపీకి చెందిన బీజేపీ ముఖ్య నేత పార్టీ నిర్ణయం స్పష్టం చేసారు.
ప్రధాని మోదీని సీఎం జగన్ కలవటం పాలనా పరమైన వ్యవహారాల్లో భాగమేనని వెల్లడించారు. బీజేపీ, వైసీపీ కలవబోతున్నాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వైసీపీ పైన నడ్డా, అమిత్ షా చేసిన వ్యాఖ్యలతోనే ఇది స్పష్టం అయిందని వివరించారు. వైసీపీ ప్రభుత్వం పైన బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేస్తుందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఎన్టీఏ భేటీ గురించి స్పందించారు.

బిల్లుకు మద్దతు ఇస్తారా : టీడీపీతో బీజేపీ స్నేహం 2017లోనే ముగిసిందని మాధవ్ స్పష్టం చేసారు. గతంలో దూరమైన మిత్రులకు త్వరలో జరిగే ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానం లేదని చెప్పుకొచ్చారు. మిత్రపక్షమైన జనసేనతో కలిసి ప్రజాక్షేత్రంలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు. ఈ మేరకు రోడ్ మ్యాప్ వచ్చిందని చెప్పారు.
దీని ద్వారా టీడీపీతో బీజేపీ కలిసే అవకాశం లేదనే సంకేతాలు ఇచ్చారు. టీడీపీ తమకు భేటీకి ఆహ్వానం వస్తే విధి విధానాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. ఈ సమయంలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు విషయంలో వైసీపీ..టీడీపీ నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. పొత్తుల వేళ ఈ రెండు పార్టీల నిర్ణయం ఈ బిల్లు విషయంలో ఆసక్తికి కారణమవుతోంది.












Click it and Unblock the Notifications