ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
ఏపీలో ఆసక్తి కర రాజకీయం కొనసాగుతోంది. ఎన్నికల వేల కీలక నియోజకవర్గాల్లో సమీకరణాలు మారుతున్నాయి. కూటమిలో భాగంగా బీజేపీ పోటీ చేస్తున్న సీట్ల నుంచి టీడీపీ సీనియర్లు టికెట్ ఆశించారు. కానీ, బీజేపీకి ఖరారు చేయటంతో వారంతా ఆగ్రహానికి గురవుతున్నారు. ఉమ్మడి అనంత జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయం మారుతోంది. అక్కడ బీజేపీ నేత సత్యకుమార్ కు సీటు ఖరారు చేసారు. దీంతో, పరిటాల - సూరి నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
హోరా హోరీ
ధర్మవరం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని పరిటాల శ్రీరామ్ భావించారు. చాలా కాలంగా అక్కడ పని చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే గా గెలిచి తరువాత బీజేపీలో చేరిన వరదాపురం సూరి సైతం సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. కానీ, చివరకు అనూహ్యంగా ఈ సీటు బీజేపీకే దక్కినా..అక్కడి నుంచి సత్యకుమార్ పేరును ఖరారు చేసారు. దీంతో, సీటు ఆశించిన పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి భవిష్యత్ కార్యాచరణ పైన మద్దతు దారులతో చర్చలు చేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు.

సహకారం అందేనా
వరదాపురం సూరి ఈ నెల 31న అనుచరవర్గంతో సమావేశం కానున్నారు. ఇప్పటికే సూరిని స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయాలంటూ అనుచర వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. పరిటాల కుటుంబానికి రాప్తాడు లో టీడీపీ సీటు దక్కింది. సునీతకు రాప్తాడు సీటు కేటాయించారు. కుటుంబానికి ఒక్క సీటు అనే విధానం అమలు చేసినట్లు చంద్రబాబు స్పష్టం చేసారు. ధర్మవరంలో స్థానికంగా వైసీపీ వర్సస్ టీడీపీ అన్నట్లుగా నే రాజకీయం కొనసాగుతోంది. 2014లో వరదాపురం సూరి టీడీపీ నుంచి ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయన అనూహ్యంగా టీడీపీని వీడి బీజేపీలో చేరిపోయారు. దీంతో, పరిటాల శ్రీరామ్ ఇంఛార్జ్ గా వ్యవహరించారు.
కీలక పరిణామాలు
నాలుగేళ్ల నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు. టీడీపీ క్యాడర్ బయటకు వెళ్లకుండా అంతా తానే అయి పార్టీ జెండాను అక్కడ నిలబెడుతూ వచ్చారు. ఇదే నియోజకవర్గం నుంచి జనసేన సైతం సీటు ఆశించింది. అనంతపురం ఎంపీ సీటు ఆశించిన సత్యకుమార్ సాధ్యం కాకపోవటంతో ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పార్టీ నాయకత్వాన్ని ఒప్పించి సీటు సాధించారు. ఈ క్రమంలో ఇప్పుడు శ్రీరామ్, వరదాపురం సూరి సహకారం పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలోనే వరదాపురం సూరి తాను పోటీలో ఉంటానని స్పష్టం చేసారు. దీంతో, ఇప్పుడు ధర్మవరంలో పోటా పోటీ గా సాగుతున్న రాజకీయం ఎన్నికల వేళ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications