మీరు విప్పుకోవడం కాదు.. ప్రజలే విప్పుతారు!
మీరు బట్టలు విప్పడం కాదని, 2024లో ప్రజలే మీ బట్టలు విప్పేసే పరిస్థితి రాబోతోందని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటన సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ తన చొక్కా విప్పేసి చంద్రబాబుకు సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లదాడి చేయడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు.
ఇంకో మంత్రి ప్యాంటు విప్పుతారు
మంత్రి హోదాలో ఉన్న సురేష్ చొక్కా విప్పి సవాల్ విసరడం సిగ్గుచేటని, ముఖ్యమంత్రి జగన్ దగ్గర మెప్పు పొందడానికే ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఈరోజు ఒక మంత్రి చొక్కా విప్పితే రేపు ఇంకో మంత్రి ప్యాంటు విప్పుతాడని, ఆ తర్వాత మరోమంత్రి బట్టలన్నీ విప్పేసే పరిస్థితిని చూడాల్సి వస్తుందన్నారు. ఈ తరహా విషయాల్లో జగన్ జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందనే అభిప్రాయాన్ని రాజు వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో వందకు వందశాతం వైసీపీ ఓటమి ఖాయమన్నారు.

మంచి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందో చెప్పడానికే తానే ఒక ఉదాహరణ అని, ఒకప్పుడు తాను రోలెక్స్ వాచ్ వాడేవాడినని, ఇప్పుడు సాధారణ వాచీని వాడుతున్నానని తన వాచ్ ను చూపించారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకు వెళితే పార్టీని మూసుకోవడమే బెటర్ అన్నారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో మంచి తీర్పు ఇచ్చిందని, అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు నిందితులు ఇంకా బయటకు రాలేదని, ప్రధానమైనవారంతా కలుగులో దాక్కున్నారని వ్యాఖ్యానించారు.

ఆ దమ్ము, ధైర్యం ఎవరికి ఉంటుంది.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చిన్నాన్నను చంపే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని, వివేకా కుమార్తె సునీతకు న్యాయం జరుగుతుందని తాను నమ్ముతున్నానన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి ఖాయమని విష్ణుకుమార్ రాజు అన్నారు.












Click it and Unblock the Notifications