గవర్నర్ దగ్గర అపాయింట్ మెంట్ కూడా ఇప్పించలేకపోయారు..!?
భారతీయ జనతాపార్టీతో కలిసి పనిచేయలేకపోతున్నామని, రోడ్ మ్యాప్ ఇస్తానన్నారుకానీ ఇంతవరకు ఏమీ ఇవ్వలేదని, అందుకే తాను వ్యూహం మార్చుకుంటున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దీనికే తాను మోడీకి వ్యతిరేకం కాదని, బీజేపీకి దూరం కాలేదని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత భారతీయ జనతాపార్టీలో అలజడి ప్రారంభమైంది.

పవన్ కు ఫోన్ కూడా చేయలేదు..
పార్టీలో నేతలంతా అంతర్గతంగా మాట్లాడుకున్నారుకానీ పవన్ కల్యాణ్ తో ఎవరూ చర్చించలేదు. సోము వీర్రాజు వపన్ ను కలిసిన రోజే కానీ ఆ తర్వాత నుంచి బీజేపీ తరఫున కనీసం ఫోన్ కూడా రాలేదు. విశాఖపట్నంలో పోలీసులు తనకు నోటీసులివ్వడం, నగరం నుంచి వెళ్లిపోవాలనడంతోపాటు జరిగిన సంఘటనలపై ఫిర్యాదు చేయడానికి గవర్నర్ అపాయింట్ మెంట్ అడిగారు.
కానీ ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదు. చిత్రమేమంటే.. అదేరోజు బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి గవర్నర్ ను కలిశారు. గతంలో ఈ వ్యక్తి పవన్ పై నిప్పులు చెరిగారు. తాను గవర్నర్ ను కలిశానని, జనసేనానిపై ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ సమయంలో గవర్నర్ ను కలవడం ఏమిటని, పవన్ పై ఫిర్యాదు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు.

బీజేపీ నుంచి సరైన సహకారం లేదు!
కేంద్రంలో అధికారంలో ఉన్నారని, తనకు అండగా ఉంటారనే నమ్మకంతో అధికార పార్టీపై, ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేస్తున్నప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతల నుంచి తాను కోరుకున్న రీతిలో సహకారం అందడంలేదని పవన్ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక తర్వాత ఇరు పార్టీలు ఇంతవరకు కలిసి ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఢిల్లీ పెద్దలను కలవడానికికూడా పవన్ ప్రయత్నించినప్పటికీ అక్కడ కూడా అపాయింట్ మెంట్ ఇప్పించలేకపోయారు.

కలిసి పనిచేసే ఉద్దేశం లేదు!
బీజేపీ నేతలు కేంద్రం నుంచి ఒక్క ఫోన్ కాల్ చేయించినా గవర్నర్ కార్యాలయం నుంచి జనసేనానికి కాల్ వచ్చేది.. అపాయింట్ మెంట్ ఇస్తున్నాం రండి అని. కానీ ఆ చిన్న పని కూడా చేయడానికి బీజేపీ నేతలు సహకరించలేదంటే భవిష్యత్తులో వారికి జనసేనతో కలిసి పనిచేసే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. వారి వ్యవహారశైలి, పనితీరు కూడా అలాగే ఉన్నాయని జనసైనికులు చెబుతున్నారు.
కానీ హఠాత్తుగా సోము వీర్రాజు వచ్చి సంఘీభావం తెలియజేసినంతమాత్రాన బీజేపీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం మాత్రం తమకు లేదని, కాకపోతే కొద్దిరోజులు వేచిచూసే ధోరణిలో ఉంటామని జన సైనికులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ తో కలిసి వెళ్లాలనే ఉద్దేశం బీజేపీకి ఉండివుంటే కచ్చితంగా అపాయింట్ మెంట్ తీసుకునేవారని, వారికి ఏమాత్రం అటువంటి ఉద్దేశం లేదని స్పష్టమవుతోందని, అందుకే పవన్ కల్యాణ్ తన దారి తాను చూసుకున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications