తొక్కేస్తున్నారు, ఇలాగే పడుకుందామా!: బాబుపై బిజెపి సంచలనం
విజయవాడ: ఏపీలో బిజెపి - టిడిపిలు కలిసే ఉంటాయని ఓ వైపు కొందరు నాయకులు చెబుతున్నప్పటికీ.. పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సోమవారం నాడు విజయవాడలో బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో నాయకుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో మంత్రులు కామినేని శ్రీనివాస్ రావు, మాణిక్యాల రావు, బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ కేంద్రమంత్రులు కృష్ణంరాజు, పురంధేశ్వరి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ఉద్దేశ్యపూర్వకంగా టిడిపి దుష్ప్రచారం చేస్తోందన్నారు. దీనిని తిప్పికొట్టకపోతే బిజెపి శ్రేణుల్లో అపోహలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. బిజెపి మీదకు విపక్షాలకు ఎగదోసేలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్రం వేల కోట్లు ఇచ్చినా చెప్పడం లేదన్నారు.

బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు విష్ము మాట్లాడుతూ.. టిడిపి - బిజెపి మధ్య అపోహలు తొలగించుకోవడానికి ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బిజెపి వారిని టిడిపి తొక్కేస్తోందని, తొక్కించికుంటూ ఇంట్లో పడుకుందామా, జనంలోకి వెళ్దామా అని మరికొందరు ఘాటుగా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అయితే కొందరు నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటగా, సాధ్యాసాధ్యాలను బట్టి అసెంబ్లీ, పార్లమెంటు, జిల్లా స్థాయిల్లో బహిరంగ సభలను నిర్వహించాలని జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం సూచించింది. ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీ లోపు అన్ని జిల్లాల్లోను కార్యవర్గ సమావేశాలు నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications