అన్నామలై ఇక ఆంధ్రామలై - మోదీ మార్క్ రాజకీయం..!!
ఏపీ కేంద్రంగా బీజేపీ అసలైన రాజకీయం మొదలు పెట్టింది. కూటమిలో ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవటం పైన బీజేపీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ నుంచి రాజ్యసభ స్థానాల విషయంలో బీజేపీ తొలి నుంచి గట్టిగానే వ్యవహ రిస్తోంది. ఇప్పటికే ఆర్ క్రిష్ణయ్య ను తమ పార్టీ నుంచి ఎంపిక చేసిన బీజేపీ.. ఇప్పుడు సాయిరెడ్డి స్థానం తమకే కావాలని తేల్చేసింది. ఈ సీటు నుంచి బీజేపీ అభ్యర్దిగా ఎవరికి అవకాశం దక్కుతుం దనే చర్చకు సమాధానం వచ్చింది. సాయిరెడ్డి స్థానంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ పోటీ చేయనున్నారు.
సాయిరెడ్డి స్థానంలో
వైసీపీ ఎంపీ సాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసారు. ఆయన స్థానం తిరిగి అసెంబ్లీలో పూర్తి మెజార్టీ ఉండటంతో కూటమికే దక్కనుంది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సం ఘం షెడ్యూల్ విడుదల చేసింది. కూటమి నుంచి ఈ సీటు బీజేపీకి వెళ్లటం ఖాయమైంది. బీజేపీ ఈ సీటు తామే తీసుకుంటున్నట్లు సాయిరెడ్డి రాజీనామా సమయంలోనే స్పష్టం చేసింది. కాగా, బీజేపీ నుంచి పలువురి పేర్లు ఈ స్థానం కోసం రేసులోకి వచ్చాయి. ఒక దశలో తిరిగి సాయిరెడ్డికే బీజేపీ ఈ సీటు కేటాయించనుందనే ప్రచారం సాగింది. అయితే, సాయిరెడ్డికి ఇప్పటికి ఇప్పుడు సీటు కేటాయించేందుకు బీజేపీ నేతలు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో, ఏపీ నుంచి సాయి రెడ్డి స్థానంలో అనూహ్యంగా బీజేపీ తమ అభ్యర్ధిని ఖరారు చేసింది.

ఏపీ నుంచి అన్నామలై
వచ్చే ఏడాది తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికలను బీజేపీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అక్కడ అన్నా డీఏంకేతో పొత్తు ఖాయం చేసుకుంది. ఈ పొత్తు వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి అన్నామలైను తప్పించారు. పొత్తు ప్రకటన వేళ పార్టీ ముఖ్యనేత అమిత్ షా తాము జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు వినియోగించుకుంటామని ప్రకటించారు. కాగా, ముందుగా అన్నామలైను రాజ్యసభ కు ఎంపిక చేయాలని బీజేపీ నాయకత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. అందులో భాగంగా తమిళనాడు పొరుగు రాష్ట్రంగా ఉన్న ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో అన్నామలైను రాజ్యసభకు పంపాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కేంద్ర మంత్రిగా..
గతంలో ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యులుగా వ్యవహరించి సురేశ్ ప్రభు సైతం కేంద్ర మంత్రి గా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో అన్నామలైకు మద్దతుగా లోకేష్ సైతం ఎన్నికల ప్రచారం చేసారు. బీజేపీ సూచన మేరకు ఇప్పటికే ఈ సీటు ను వారికే వదిలేయాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. అన్నామలైకు ఇవ్వటం ద్వారా ఏపీ - తెలంగాణలోనూ రానున్న రోజుల్లో పార్టీకి మేలు చేస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పవన్ సనాతన ధర్మం పేరుతో ఏపీలో కొత్త సమీకరణాలకు తెర తీసారు. ఇప్పుడు అన్నామలై సైతం ఏపీ నుంచే ఎంపీగా ఉంటే బీజేపీ భవిష్యత్ వ్యూహాలు పక్కాగా అమలు చేయవచ్చని చెబుతున్నారు. చివరి నిమిషం లో అనూహ్యంగా నిర్ణయం మారితే మినహా.. సాయిరెడ్డి స్థానం అన్నామలైకు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications