బీజేపీకి మరో సీటు - స్థానాలు, అభ్యర్దులు ఫైనల్: ఫలించిన లేఖాస్త్రం..!!
ఏపీలో మూడు పార్టీల పొత్తుల్లో పోటీ స్థానాలపై స్పష్టత వస్తోంది. బీజేపీ కి పొత్తులో భాగంగా కేటాయించిన స్థానాల పైన వరుస చర్చలు సాగాయి. కొన్ని మార్పు కోసం బీజేపీ పట్టు బట్టింది. దీని పైన చంద్రబాబు తో వరుసగా మంతనాలు జరిగాయి. తమకు ప్రకటించిన స్థానాలను మరింత పెంచాలని బీజేపీ నేతలు కోరారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ ముఖ్యులు కేంద్ర నాయకత్వానికి లేఖ రాసారు. వీటి పైన చర్చల తరువాత స్థానాలు, అభ్యర్దులను పార్టీ ఖరారు చేసింది.
బీజేపీ లిస్టు సిద్దం : పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. అమరావతి కేంద్రంగా బీజేపీ ముఖ్య నేతలు చంద్రబాబు, పవన్ తో సమావేశమయ్యారు. స్థానాల పైన చర్చలు చేసారు. ఆరు ఎంపీ స్థానాలను ఖరారు చేసారు. అదే సమయంలో అభ్యర్దుల పేర్లు బయటకు వచ్చాయి. దీని పైన ఏపీ బీజేపీ నేతలు జాతీయ నాయకత్వానికి లేఖలు రాసారు. టీడీపీ మద్దతు దారులుగా గుర్తింపు ఉన్న నేతలకు సీట్లు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ ఓడిపోయే స్థానాలు బీజేపీకి ఇస్తూ వెన్నుపోటు పొడుస్తుందని ఆరోపించారు. దీంతో, పార్టీ నాయకత్వం పురందేశ్వరిని ఢిల్లీకి పిలిచింది. సీట్లు, అభ్యర్దుల పైన చర్చలు చేసిన తరువాత తాజాగా అసెంబ్లీ స్థానం పది నుంచి 11కు పెంచాలని కోరింది.

అదనంగా మరో సీటు : బీజేపీ నుంచి పోటీ చేసే స్థానాలు, అభ్యర్దుల పైన ఒక నిర్ణయానికి వచ్చింది. రేపు (గురువారం) బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. అందులో ఆమోదం పొందిన తరువాత జాబితా అధికారికంగా ప్రకటన చేయనున్నారు. బీజేపీ పాడేరు, వైజాగ్ నార్త్, శ్రీకాకుళం, అనపర్తి, కైకలూరు, విజయవాడ పశ్చిమం, బద్వేలు, ఆదోని, జమ్మలమడుగు, ధర్మవరం, 11వ స్థానంగా కాకినాడ అసెంబ్లీ స్థానాలు ఖరారైనట్లు సమాచారం. అదే విధంగా ఎంపీ స్థానాలుగా విజయనగరం, అరకు, అనకాపల్లి, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి నియోజకవర్గాలు ఫైనల్ అయ్యాయి. అయితే, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కోరిన విధంగా టీడీపీ ముద్ర ఉన్న నేతల విషయంలో ఇద్దరికి సీట్లు ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం నిరాకరించినట్లు సమాచారం.

స్థానాలు - అభ్యర్దులు ఖరారు : పార్టీ కోసం ఏళ్ల తరబడిగా పని చేస్తున్న వారికి కూడా సీట్లు కేటాయించాలని గత వారం బీజేపి హై కమాండ్ కి ఏపీ నేతలు లేఖ రాసారు. దీంతో, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ తో పాటుగా జీవీఎల్ పేరు రేసులో ఉంది. అనకాపల్లి నుంచి మాధవ్, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, అరకు నుంచి కొత్తపల్లి గీత, నర్సాపురం నుంచి నరేంద్ర వర్మ, తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ రత్నప్రభ కుమార్తె పేర్లు తుది జాబితాలో ఉండే అకవాశం ఉందని తెలుస్తోంది. సోము వీర్రాజును కాకినాడ లేదా అనపర్తి నుంచి పోటీకి దింపే ఛాన్స్ ఉంది. జమ్మల మడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూరి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. గురువారం రాత్రి ఈ జాబితాను బీజేపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications