బీజేపీ తేల్చేసింది-ఇక జగన్ అడుగులపైనే ఉత్కంఠ ! ఏం చేస్తే ఏం జరగబోతోంది ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంలో ఆ పార్టీ మద్దతు కోసం జట్టు కట్టిన బీజేపీ.. రాష్ట్రానికి చేసిందేమీ లేకపోయినా ఏపీలో అధికార పార్టీని మాత్రం ఫుల్లుగా వాడేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ పలు విమర్శలు ఎదుర్కొన్నా అంతిమంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి కాస్తో కూస్తో ప్రయోజనం లభిస్తుందని ఆశించింది. అయితే తాజాగా రెవెన్యూ లోటు భర్తీ కింద నిధుల విడుదల మినహాయించి బీజేపీ చేసిందేమీ లేదు. కానీ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా పోరుకు సిద్ధమైంది.
తాజాగా వైసీపీ సర్కార్ పై అమిత్ షా, జేపీ నడ్డా చేసిన విమర్శల్ని అధికార పార్టీ త్వరగానే గ్రహించి ఎదురుదాడి మొదలుపెట్టేసింది. అయితే సీఎం జగన్ మాత్రం ఇతర విపక్షాలు టీడీపీ, జనసేనతో బీజేపీని కలిపి విమర్శించేందుకు అంత త్వరగా సిద్ధపడలేదు. కేవలం బీజేపీ మద్దతు మనకు ఉండకపోవచ్చంటూ ఓ హింట్ మాత్రం ఇచ్చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ మద్దతు లేకుండానే తాము బరిలోకి దిగుతున్నట్లు జగన్ ప్రకటించేసినట్లయింది.

మరోవైపు బీజేపీ మద్దతు లేకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోబోతున్న జగన్ రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే గతంలో 2018లో చంద్రబాబుపై విభజన హామీల పేరుతో రాజకీయంగా ఒత్తిడి పెంచిన జగన్.. కేంద్రం నుంచి, ఎన్డీయే నుంచి ఆ పార్టీని బయటకు తేవడంలో కీలకపాత్ర పోషించారు. చివరికి బీజేపీతో స్నేహం లేదని నిరూపించుకునేందుకు చంద్రబాబు ధర్మపోరాటం చేసేలా చేశారు. కానీ ఇప్పుడు తాను అదే ధర్మపోరాటం చేయలేని పరిస్దితి.
బీజేపీ తనకు దూరమవుతున్నా తాను మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన వ్యూహంతోనే తాను ముందుకు వెళ్లేందుకు జగన్ ఇప్పుడు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ వైసీపీ నేతలు మాత్రం నిన్నే బీజేపీపై విమర్శల దాడి మొదలుపెట్టేశారు. ఇప్పుడు బీజేపీ కూడా దీన్ని అందిపుచ్చుకుని మాటల దాడి కొనసాగిస్తే కచ్చితంగా వైసీపీ ఆత్మరక్షణలో పడటం ఖాయం. అలాగే వైసీపీ కూడా బీజేపీపై మాటల దాడిని ఎక్కువకాలం కొనసాగించకపోవచ్చు. ఎందుకంటే బీజేపీతో మితృత్వం లేకపోయినా ఫర్వాలేదు కానీ శత్రువు అయితే మాత్రం కష్టం. దీంతో జగన్ అడుగులపై ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications