వైసీపీ పేరు చెప్పి ఆడుకుంటున్న బీజేపీ ఎమ్మెల్యే ? చంద్రబాబుకు సంకటం..!
ఏపీలో కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. వీటిలో జనసేన నుంచి పెద్దగా ఇబ్బందులు లేకపోయినా బీజేపీ విషయంలో మాత్రం సీఎం చంద్రబాబుకు ఇబ్బందులు తప్పడం లేదు. కేంద్రంలో బీజేపీతో పెట్టుకున్న పొత్తు కారణంగా రాష్ట్రంలో బీజేపీని భరించాల్సిన పరిస్ధితి. ఇదే అదనుగా బీజేపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా వీరి విషయంలో చంద్రబాబు దూకుడుగా ముందుకెళ్లలేకపోతున్నట్లు తెలుస్తోంది.
కూటమి అధికారంలోకి వచ్చాక రాయలసీమ జిల్లాల్లో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ దూకుడు అంతకంతకూ పెరుగుతోంది. గతంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కుటుంబానికి చెందిన ట్రక్కుల్ని అడ్డుకున్న ఆదినారాయణరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డితో వైరానికి సై అంటే సై అన్నారు. చంద్రబాబు రంగంలోకి దిగి ఇద్దరినీ మందలించే సరికి గొడవ సద్దుమణిగింది. ఇప్పుడు కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఆది వర్గం బెదిరింపులకు దిగుతుండటంతో కలకలం రేగుతోంది.

కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలను వారి వాహనాల రవాణా కాంట్రాక్టులన్నీ తనకే ఇమ్మంటూ ఆదినారాయణరెడ్డి బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆదినారాయణరెడ్డి తీరుపై వారు కూటమి సర్కార్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆదినారాయణరెడ్డి అవన్నీ వైసీపీ ఫ్యాక్టరీలని వివరణ ఇచ్చారు. స్థానికుల్ని పట్టించుకోకుండా ముందుకెళ్తున్న వైసీపీ సిమెంట్ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తున్నట్లు ఆదినారాయణ రెడ్డి చెప్పుకొస్తున్నారు.
తద్వారా వైసీపీ వారిని కూడా టార్గెట్ చేయనివ్వరా అంటూ ప్రభుత్వాన్ని ఆయన పరోక్షంగా ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు సిమెంట్ ఫ్యాక్టరీలపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానంటున్నారు. తనది తప్పని తేలితే రాజీనామా కూడా చేస్తానని ప్రకటించారు. దీంతో ఆది విషయంలో ఏ చర్యలు తీసుకోవాలో తెలియక చంద్రబాబు మథన పడుతున్నారు. ఆది చేఫ్టలతో ప్రభుత్వం పరువు పోయే పరిస్ధితి వస్తుంటడంతో ఏదో ఒకటి తేల్చక తప్పని పరిస్దితి చంద్రబాబుకు ఎదురవుతోంది.












Click it and Unblock the Notifications