వైసీపీ, టీడీపీ కుల రాజకీయాలు, బీసీల విషయంలో సోషల్ జస్టిస్ పై చర్చకు వస్తారా : బీజేపీ ఎంపీ జీవీఎల్ ధ్వజం
బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు .సామాజిక సాధికారత పేరుతో రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. సామాజిక సాధికారత ఒక భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యమైందని పేర్కొన్న ఆయన అన్ని సామాజిక వర్గాలను కొన్ని రాజకీయ పార్టీలు కేవలం తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నాయని విమర్శించారు.

వైసీపీ, టీడీపీ కులరాజకీయాలపై జీవీఎల్ ఫైర్
విజయవాడలో మీడియాతో మాట్లాడిన జీవీఎల్ నరసింహారావు వ్యక్తులకు లబ్ధి చేకూరినంత మాత్రాన సామాజికంగా అన్నివర్గాలకు న్యాయం చేకూరినట్లు కాదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు వైసీపీ, ఇటు టిడిపి కుల రాజకీయాలకు తెర తీశాయని విమర్శించిన జీవీఎల్ నరసింహారావు కేవలం రాజకీయ అజెండా తోనే వారి విమర్శలు, ప్రతి విమర్శలు దిగుతున్నారని పేర్కొన్నారు. వైసిపి హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని టిడిపి, తాము బీసీలకు సముచిత స్థానం ఇచ్చామని వైసిపి ఇప్పటికే పెద్ద ఎత్తున మాటల దాడికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

బీసీలకు న్యాయం చేశామని చెప్పుకోవటం సిగ్గు చేటు
తాజాగా చంద్రబాబు కూడా వైసీపీ ప్రభుత్వం బీసీలను అక్రమ కేసులతో వేధిస్తూ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.35కు పైగా బీసీలకు అందించే పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారని వివరించారు. టిడిపి హయాంలో రాష్ట్రంలో బీసీల కోసం అమలైన పథకాలు జగన్ ఇవ్వట్లేదని చంద్రబాబు పేర్కొన్నారు. బీసీలను వైసిపి రాజకీయంగా అణిచి వేస్తుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బీసీలకు తాము సముచిత స్థానం ఇచ్చామని వైసీపీ నేతలు చెప్తున్నారు. చంద్రబాబే బీసీలకు అన్యాయం చేశారన్నారు . ఇక తాజాగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు బీసీలకు న్యాయం చేస్తామని రెండు పార్టీలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

సోషల్ జస్టిస్ అమలు కేవలం బీజేపీ సర్కార్ లోనే
మెడికల్ సీట్లలో 27 శాతం బీసీలకు వచ్చేలా ప్రధాని నరేంద్రమోడీ చేశారని, ఇక రోహిణి కమిషన్ ఆదేశాలను దేశంలో సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టింది కూడా నరేంద్ర మోడీ సర్కార్ అని ఆయన చెప్పుకొచ్చారు. సోషల్ జస్టిస్ ఎజెండా పై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నానని ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయం సామాజిక అజెండాగా అమలు అవ్వాలి కానీ, రాజకీయ అజెండాగా అమలు కాకూడదని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఇప్పటివరకు వైసిపి, టిడిపి తాము అధికారంలో ఉండగా ఎంత మంది బీసీలను రాజ్యసభకు పంపాయో స్పష్టంగా చెప్పాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.

కార్పోరేషన్లు పెట్టామని చెప్పటం కేవలం పబ్లిసిటీ స్టంట్
ఓబిసి, ఎస్సి లలో కొన్ని వర్గాలకు జరిగిన అన్యాయం పై రాజకీయ వేదికపై చర్చిస్తామని జీవీఎల్ చెప్పారు. కార్పొరేషన్లు పెట్టామని చెప్పుకోవటం పబ్లిసిటీ చేసుకోవడమే తప్ప సామాజిక సాధికారత ఎక్కడ ఉందో టిడిపి, వైసిపి చెప్పాలని డిమాండ్ చేసిన జీవీఎల్ నరసింహారావు సామాజిక సాధికారిక అజెండాపై అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసిపి అధికార మదంతో ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.

బీసీలకు బీజేపీ తప్ప ఎవరూ, ఏమీ చేసింది లేదు
టిడిపి తమ పాలనలో బీసీలకు న్యాయం జరిగిందని చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు జీవీఎల్ నరసింహారావు. బీజేపీ, జనసేన ఒక అజెండాతో ముందుకు వెళ్తున్నాయని, ప్రస్తుతం ఏపీలో రాజకీయ శూన్యత ఉందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. బీసీలకు టిడిపి ప్రభుత్వం కానీ, వైసిపి ప్రభుత్వం గానీ చేసిందేమీ లేదని సామాజిక సాధికారత సాగిస్తున్న ప్రభుత్వం ఒక్క బీజేపీ ప్రభుత్వమేనని జీవీఎల్ నరసింహారావు బల్లగుద్ది మరీ చెప్పారు.












Click it and Unblock the Notifications