'అతడు' పలుకు ఆడంబరంగాను... 'ఇతడు' పలుకు చల్లగాను... వినురవేమా??
భారతీయ జనతాపార్టీతో జనసేన పార్టీకున్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇద్దరూ మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నిక తర్వాత ఇరుపార్టీల మధ్య దూరం పెరిగింది. ఈ విషయమై జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా స్పందించారు. కరోనా వల్ల తమ మధ్య భౌతిక దూరం పెరిగిందని, కరోనా తగ్గగానే తమ మధ్య దూరం కూడా తగ్గుతుందని వ్యాఖ్యానించారు. అంటే కరోనా తగ్గేది లేదు.. జనసేన, బీజేపీ మధ్య సఖ్యత కుదిరేదీ లేదు అనే విషయాన్ని పవన్ నర్మగర్భంగా చెప్పారని విశ్లేషకులు చెబుతున్నారు.
Recommended Video

175 సీట్లలో పోటీకి సిద్ధపడుతున్న బీజేపీ
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తాము రాబోయే ఎన్నికల్లో 175 సీట్లలోను పోటీచేస్తున్నామని ప్రకటించారు. అంటే జనసేనతో పొత్తు లేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా తెలిపారు. ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ఉండివుంటే ఆయన ఈ ప్రకటన చేసివుండేవారు కాదు. అంతేకాదు ప్రధాని భీమవరం పర్యటన, అంతకుముందు రాజమండ్రిలో జేపీ నడ్డా గోదావరి గర్జన, అమరావతి గ్రామాల్లో పాదయాత్ర తదితర కార్యక్రమాలకు బీజేపీ జనసేనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సొంతంగానే ఆయా కార్యక్రమాలు చేపట్టింది.

దూరం జరుగుతున్న పవన్
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతో బీజేపీ నేతలు పలువురు సఖ్యతగా మెలుగుతున్నారనే ఉద్దేశంతో ఉన్న పవన్ కల్యాణ్ ఆ పార్టీకి క్రమేణా దూరం జరగడం ప్రారంభించారు. ఈ ఒక్క కారణమే కాకుండా బయటకు తెలియని పలు కారణాలు కూడా దూరం పెరగడానికి కారణమయ్యాయి. వాస్తవానికి బీజేపీకి 175 నియోజకవర్గాల్లో కనీసం మంచి పేరున్న అభ్యర్థులే లేరు. జనసేనే గట్టి అభ్యర్థుల కోసం నానా తిప్పలు పడుతోంది. అటువంటిది బీజేపీ ఏకంగా 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామంటూ గర్జించడం హాస్యాస్పదంగా ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అధిష్టానం చెప్పిందే చివరి నిర్ణయం
జీవీఎల్ నరసింహారావు చెప్పినా, సోము వీర్రాజు చెప్పినా, ఎవరు చెప్పినా అది అధికారికం కాబోదు. ఏ ప్రకటనైనా, ఏ కీలక నిర్ణయమైనా ఢిల్లీ అధిష్టానం నుంచి వెలువడుతుంది. ఇరు పార్టీల మధ్య దూరం పెరిగిపోతున్న కీలకమైన తరుణంలో, ఎన్డీయే నుంచి కీలకమైన మిత్రపక్షాలన్నీ బయటకు వెళ్లిపోతున్న తరుణంలో ఆ పార్టీ జనసేనను దూరం చేసుకుంటుందా? లేదా? అనేదానిపై స్పష్టత రావాలంటే కొద్దికాలం వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications