ఢిల్లీలో సీఎం జగన్‌పై తీవ్ర చర్చ.. కేసీఆర్ ఫార్ములాతో వైసీపీకి చెక్.. ఏపీ బీజేపీ ప్లాన్ ఇదేనట..
''అమరావతి తరలింపు అంశం ఇప్పటికే నేషనల్ సబ్జెక్ట్ అయింది. ఇప్పుడిక ఇంటర్నేషనల్ అంశంగానూ మారుతోంది. ప్రపంచానికి కరోనా వైరస్ లాగా.. ఏపీకి వైసీపీ వైరస్ పట్టింది. ప్రస్తుతం ఢిల్లీలో ప్రతి ఒక్కరూ ఏపీ సీఎం జగన్ గురించే చర్చించుకుంటున్నారు. ఇంత వింత పరిపాలనను ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు. ప్రజలు 150 సీట్లిచ్చి గెలిపిస్తే.. అధికారంలోకి వస్తూనే పీపీఏలు రద్దు చేశారు. జగన్ ఇచ్చిన 4000కిలోవాట్ల షాక్‌కు.. ఇన్వెస్టర్లు ఏపీ అంటేనే 1000కిలోమీటర్ల వేగంతో పారిపోతున్నారు. తొమ్మిది నెలల్లో ఒక గంప సిమెంటునైనా అభివృద్ధి పనులకు వాడలేదు'' అంటూ బీజేపీ ఎంపీ సుజనాచౌదరి మండిపడ్డారు.

ఏపీ ఇండియాలో భాగం కాదా?
రాజధాని కోసం గత 3 నెలల్లో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే కనీస హక్కును కూడా జగన్ ప్రభుత్వం దారుణంగా కాలరాస్తోందని, మహిళల్ని కూడా బూటుకాళ్లతో తంతూ, బూతులు తిడుతూ, ఇష్టానుసారంగా హింసలు పెడుతున్నారని సుజనా చౌదరి ఆరోపించారు. కోర్టులు చెప్పినా వినిపించుకోకుండా జగన్ తన ఇష్టానుసారంగా పానల సాగిస్తున్నాడని, అసలు ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఒక భూభాగమేనా? అక్కడ ప్రజాస్వామ్యం ఉందా? అనే సందేమాలు తలెత్తుతున్నాయని అన్నారు.

కేసీఆర్ తరహాలో..
‘‘అమరావతి విషయంలో బీజేపీ మొదటి నుంచీ క్లారిటీతోనే ఉంది. రాజధానిని అక్కడే కొనసాగించాలని మేం రాజకీయ తీర్మానాలు కూడా చేశాం. పార్టీలో కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినంతమాత్రాన జరిగేదేమీ ఉండదు. అమరావతి తరలింపునకు కేంద్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదు. ఈ విషయంలో మేం కేసీఆర్ ఫార్ములాను ఫాలో అవుతాం. కేసీఆర్ ఎలాగైతే రాజకీయ తీర్మానాలు చేసి తెలంగాణను సాధించుకున్నారో.. అదేరీతిగా ఏపీ బీజేపీ కూడా రాజకీయ తీర్మానాల ద్వారానే అమరావతిని కాపాడుకుంటుంది.

కోర్టులు ఊరుకోవు..
ఏపీలో రాజధాని ఏర్పాటుకు ఇవ్వాల్సిన నిధులన్నీ కేంద్రం అమరావతికే ఇచ్చేసిందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇప్పుడా రాజధానిని తరలిస్తామంటే కేంద్రంతోపాటు కోర్టులు కూడా ఊరుకోబోవని సుజనా చెప్పారు. అమరావతి తరలింపు వల్ల 13 గ్రామాలు డైరెక్టుగా, 13 జిల్లాలు ఇన్ డైరెక్టుగా ఎఫెక్ట్ అయ్యాయని, ఇప్పటికైనా జగన్ రాజధాని తరలింపు ఆలోచన మానుకుని.. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

అమరావతి ఆక్రందన..
ఏపీ రాజధాని అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ‘‘అమరావతి ఆక్రందన''పేరుతో ప్రచురితమైన పుస్తకాన్ని బీజేపీ ఎంపీ సుజనా విడుదల చేశారు. అమరావతిలో రాజధాని కోసం 52వేల ఎకరాల్ని సేకరించారని, గతంలో హైదరాబాద్ రెవెన్యూను 23 జిల్లాలు పంచుకున్నట్లే.. ఇప్పుడు అమరావతి ఆదాయాన్ని కూడా 13 జిల్లాలకు పంపిణీ అవుతుందని, ప్రాతీయ విభేదాలనేవి సీఎం జగన్ సృష్టిస్తున్నవేనని సుజనా ఆరోపించారు.












Click it and Unblock the Notifications