చంద్రబాబు జోరువానలో తడుస్తూనే..: వరద సహాయం.. బిజెపి రూ.కోటి విరాళం
నెల్లూరు: ఏపీలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ నష్టం సంభవించింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జోరు వానలోనే పర్యటిస్తున్నారు. వరద సహాయక చర్యల పైన అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
శనివారం నాడు చంద్రబాబు జోరువానలోనే సర్వేపల్లి రిజర్వాయర్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అవసరమైతే రెండు రోజులు ఇక్కడే ఉంటానని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని చెప్పారు. బాధితులకు తక్షణం సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
మొన్న మంత్రి శిద్ధా రాఘవ రావు నడి రోడ్డు పైన కుర్చీ వేసుకొని కూర్చున్న విషయం తెలిసిందే. జాతీయ రహదారి తెగిపోవడంతో దానిని మరమ్మత్తు కోసం ఆయన రోడ్డు పైనే కుర్చీ వేసుకొని బైఠాయించారు. అవి పూర్తి చేయించారు. సీఎం చంద్రబాబు ఇప్పుడు జోరువానలోనే పర్యటిస్తున్నారు.

బిజెపి కోటి విరాళం
ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ముందుకు వచ్చారు. ఆయన పార్టీ తరఫున తమ వంతు సాయంగా రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ఆయన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపారు.
ఏపీలోని చిత్తూరు, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలలోని వరద ప్రాంతాలలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ పర్యటిస్తున్నారు. అంతకుముందు తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మీడియాతో మాట్లాడారు.
వరద సహాయక చర్యల కోసం బీజేపీ తరపున రూ.కోటి విరాళం ఇస్తున్నామని, తనకు అమిత్ షా తెలిపారని ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు, మొదటి విడత ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదల పూర్తయిందన్నారు. రెండో విడత నిధులివ్వాలని ప్రధానమంత్రి మోడీ కార్యదర్శికి సూచించానని, త్వరలోనే ఆ నిధులు వస్తాయన్నారు.
సోమశిల జలాశయంలోకి భారీగా వరదనీరు
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. సోమశిల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 52 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 29వేల క్యూసెక్కులగా ఉంది. మంత్రి పరిటాల సునీత వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ బియ్యం, సరుకులు పంపిణీపై సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications