బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్దులు ఖరారు అయింది అక్కడేనా...!?
ఏపీలో బీజేపీ అభ్యర్దులు ఖరారయ్యారు. పార్టీ సీనియర్లు కొందరికి సీట్లకు దక్కలేదు. పార్టీ కోసం చాలా కాలంగా పని చేస్తున్న తమకు సీట్లు దక్కకపోవటం పైన వారంతా ఆగ్రహంగా ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీలో గతంలో పని చేసి ఆ తరువాత బీజేపీలో చేరిన వారికి సీట్లు దక్కటం ఇప్పుడు ఈ వివాదానికి కారణంగా మారుతోంది. టీడీపీ తమ అభ్యర్దిని ప్రకటించిన అనపర్తి లాంటి స్థానంలో బీజేపీకి ఛాన్స్ ఇవ్వటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
అభ్యర్దుల ఖరారు
బీజేపీ నుంచి 10 మంది ఎమ్మెల్యే అభ్యర్దులను ఖరారు చేసారు. అందులో ఎచ్చెర్ల-ఎన్ ఈశ్వర రావు, విశాఖ నార్త్-విష్ణు కుమార్ రాజు, అరకు లోయ-పంగి రాజారావు, అనపర్తి-ఎం.శివకృష్ణం రాజు, కైకలూరు- కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్-సుజనాచౌదరి, బద్వేల్-బొజ్జా రోశన్న, జమ్మల మడుగు- ఆదినారాయణ రెడ్డి, ఆదోని- పీవీ పార్ధ సారధి, ధర్మవరం- వై సత్యకుమార్ పేర్లను పార్టీ ప్రకటించింది. పార్టీలో చాలా కాలంగా పని చేస్తున్న సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన రెడ్డి, వల్లూరి జయప్రకాశ్, రమేష్ నాయుడు లాంటి వారికి సీట్లు దక్కలేదు. వలస వచ్చిన నేతలకే ప్రాధాన్యత దక్కటం ఏంటంటూ పార్టీ సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు.

సీనియర్లకు దక్కని ఛాన్స్
బద్వేలు నుంచి ఖరారైన అభ్యర్ది రోశన్న ఒక్క రోజు ముందే బీజేపీలో చేరిన అంశాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కడప జిల్లాలో బద్వేలు, జమ్మల మడుగు సీట్లు బీజేపీకి కేటాయించటం పైన పలు సందేహాలను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 2014లో కూటమి అభ్యర్దిగా కైకలూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్ నాడు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. 2019లో పొత్తు లేకపోవటంతో పోటీ చేయని కామినేని ఇప్పుడు తిరిగి పొత్తు ఖాయమైన తరువాత సీటు దక్కించుకున్నారు. ఎంపీగా పోటీ చేయాలని భావించిన సుజనా చౌదరికి విశాఖ వెస్ట్ సీటు దక్కింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా విశాఖ తూర్పు, పశ్చిమ సీట్లు ఒకటే సామాజిక వర్గానికి ఇవ్వటం పైన చర్చ సాగుతోంది.

హైకమాండ్ ఆలోచన ఏంటి
ధర్మవరం స్థానం కోసం పరిటాల శ్రీరామ్, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వరదాపురం సూరి ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ ఆ ఇద్దరినీ కాదంటూ బీజేపీకి చెందిన బీసీ నేత సత్యకుమార్ కు ఖరారు చేసారు. అనపర్తి నుంచి ప్రకటించిన అభ్యర్దిని కాదని శివకృష్ణం రాజు పేరును ప్రకటించారు. దీంతో, తన అనుచర వర్గంతో నల్లిమిల్లి రామక్రిష్ణారెడ్డి సమావేశం ఏర్పాటు చేసారు. దీంతో, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ చెప్పిన విధంగా 11వ స్థానం కోరారా..కోరితే ఏ నియోజకవర్గం టీడీపీ నుంచి ఖరారు కానుందనేది స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ లిస్టు ప్రకటించిన సమయం నుంచి బీజేపీ కేడర్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో..ఈ అభ్యర్దులే పోటీలో ఉంటారా..ఏమైనా మార్పులు జరుగుతాయా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications