టీడీపీ-జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికలపై భారతీయ జనతాపార్టీ ఏపీ నేతల కసరత్తు కొనసాగుతోంది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వరుసగా రెండోరోజు కూడా పార్టీ పదాధికారులు, ముఖ్యనేతల సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, కొందరు ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో కుదుర్చుకోవాల్సిన పొత్తులు, ఇతర అంశాలపై పార్టీ నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పురంధేశ్వరి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన ఇప్పటికీ తమ మిత్రపక్షమేనన్నారు. వైఎస్ షర్మిల ఏ పార్టీలో చేరితే తమకెందుకని ప్రశ్నించారు. బీజేపీ బలోపేతం కోసం తామంతా ఐక్యంగా పనిచేస్తామని, పొత్తులపై తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తామన్నారు. అంతిమ నిర్ణయం మాత్రం అధిష్టానానిదేనని స్పష్టం చేశారు.

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించామని, హామీలు అమలు చేయని ప్రభుత్వంపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని, పొత్తు కోరుకునేవారు అధిష్టానంతో మాట్లాడాలని, రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉందని, తెలుగుదేశం పార్టీతో పొత్తుకు కలిసిరావాలని పవన్ కల్యాణ్ చెబితే సరిపోదన్నారు. పొత్తు కోరేవారు ముందుకు వస్తేనే సమస్య పరిష్కారమవుతుందని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. పార్టీ పదాధికారుల సమావేశం ముగిసిన తర్వాత జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. పురంధేశ్వరితో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications