తిరుపతిలో బీజేపీదే గెలుపు, జనసేనతో కలిసే పోటీ, బాబైనా, జగన్‌కైనా శిక్ష తప్పదు: సోము వీర్రాజు
చిత్తూరు: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో గెలుపు తమదేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వేరు.. పార్లమెంటు ఎన్నికలు వేరని అన్నారు. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమని పునరుద్ఘాటించారు.

వైసీపీ బెదిరింపులకు బీజేపీ భయపడదు: సోము వీర్రీజు
తిరుపతిలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై నిర్వహించిన సన్నాహాక సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు బీజేపీ భయపడదని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కోగల ధైర్యం బీజేపీకి మాత్రమే ఉందన్నారు.

జనసేనతో కలిసే తిరుపతి ఉపఎన్నికలో..
ప్రలోభాలకు, బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడకుండా వైసీపీ ఏ ఎన్నికల్లోనైనా విజయం సాధించిందా? అని ప్రశ్నించారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు వైసీపీ కోసం పనిచేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. అభివృద్ధి అజెండాగా తిరుపతి ఉపఎన్నికకు జనసేనతో కలిసి ప్రచారం నిర్వహిస్తామని, ప్రధాని మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోనే ప్రజల్లోకి వెళ్తామని సోము వీర్రాజు తెలిపారు. కిందిస్థాయిలో బీజేపీ, జనసేన పార్టీ కేడర్ బలంగా ఉందని, ఇది లోక్‌సభ ఎన్నికలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

చంద్రబాబుకైనా.. జగన్‌కైనా శిక్ష తప్పదు..
అవినీతికి బీజేపీ వ్యతిరేకమని సోము వీర్రాజు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పు చేసుంటే శిక్ష పడుతుందని.. రేపు వైఎస్ జగన్ అవినీతి చేసినా శిక్ష పడటం ఖాయమని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కాగా, తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడంతో.. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అలా.. సోము ఇలా..
ఇప్పటికే వైసీపీ, టీడీపీలు తమ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించాయి. వైసీపీ నుంచి గురుమూర్తి పోటీ చేస్తుండగా, టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేత పనబాక లక్ష్మి పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఈ ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీలో దిగే అభ్యర్థికే జనసేన మద్దతు తెలుపుతోంది. అయితే, ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ, తెలంగాణ బీజేపీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో బాగానే ఉన్న తెలుగు రాష్ట్రాల నేతల తీరు సరిగా లేదన్నారు. ఈ క్రమంలోనే సోము వీర్రాజు బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తాయని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications