ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు: వారం రోజుల్లోనే 12 మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతుండగానే.. బ్లాక్ ఫంగస్ కేసులు మరోసారి ఎక్కువగా వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో 11 బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్) కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ గురువారం వెల్లడించింది.
తాజాగా నమోదైన 11 కేసులతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య 4,889కి చేరినట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో 4, చిత్తూరు జిల్లాలో 3 కేసులు వచ్చినట్లు వెల్లడించింది. ప్రకాశం జిల్లాలో రెండు, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 463 మంది బ్లాక్ ఫంగస్ రోగులు చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. వారం రోజుల వ్యవధిలో బ్లాక్ ఫంగస్ కారణంగా 12 మంది మృతి చెందారని పేర్కొంది. తాజా మరణాలతో ఇప్పటి వరకు నమోదైన బ్లాక్ ఫంగస్ బాధితుల మరణాల సంఖ్య 448కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 59,566 నమూనాలను పరీక్షించగా.. 1378 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా నమోదైన 1378 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,16,680కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 10 మంది మృతి చెందారు.
అత్యధికంగా కృష్ణా జిల్లాలో నలుగురు మరణించగా, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,877 మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1139 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,88,101కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 14,702 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,67,45,035 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 242 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరం జిల్లాలో 13 మంది కరోనా బారినపడ్డారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 22, చిత్తూరులో 219, తూర్పుగోదావరిలో 242, గుంటూరులో 101, కడపలో 61, కృష్ణాలో 178, కర్నూలులో 15, నెల్లూరులో 166, ప్రకాశంలో 119, శ్రీకాకుళంలో 28, విశాఖపట్నంలో 69, విజయనగరంలో 13, పశ్చిమగోదావరిలో 145 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,86,081, చిత్తూరులో 2,38,557 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,449) కరోనా కేసులున్నాయి.












Click it and Unblock the Notifications