వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలో చిచ్చు, విధేయతలకూ స్నేహాలకు చెల్లుచీటి: బాబుకు సెగ

చంద్రబాబు మంత్రివర్గ విస్తరణతో టిడిపి చిచ్చు పుట్టింది. అసమ్మతి మంటలు ఎగిసిపడుతున్నాయి. బుజ్జగింపులు పనిచేయడం లేదు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి/ హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అసలు స్నేహం విలువ తెలుసా? ఆ పదం అర్థం తెలుసా? అని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జలగోపాల కృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ దులిపేశారు.

బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అనారోగ్యం సాకుగా రెండు రోజుల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో సీఎం చంద్రబాబు నాయుడు బొజ్జలను తప్పించి తన కొడుకు లోకేశ్ బాబుతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన అమర్‌నాథ్ రెడ్డికి క్యాబినెట్‌లో చోటు కల్పించిన సంగతి తెలిసిందే.

దీనిపై ఆగ్రహంతో ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన బొజ్జలగోపాల కృష్ణారెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు.. అన్నా నీ ఆరోగ్యం తనకు ముఖ్యమని సముదాయించినట్లు వార్తలొచ్చాయి. కానీ 'బొజ్జల అనారోగ్యం' గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బొజ్జల కుటుంబంలో గాయాన్ని మరింత రేపాయి. బొజ్జల కుటుంబ సభ్యులు అసహనంతో రగిలిపోతున్నారు.

మంత్రివర్గ విస్తరణ తర్వాత టిడిపిలో చెలరేగిన చిచ్చు ఆరడం లేదు. బుజ్జగింపులు పనిచేయడం లేదు. విధేయతలకూ, స్నేహాలకు చంద్రబాబు చెల్లుచీటి పలికారనే చంద్రబాబుపై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు.

వారిని దులిపేసిన బొజ్జల సతీమణి

వారిని దులిపేసిన బొజ్జల సతీమణి

బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని సముదాయించేందుకు సీఎం చంద్రబాబు దూతలుగా ఎంపి సీఎం రమేశ్, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన నివాసానికి చేరుకున్నారు. బాబు దూతలుగా వచ్చిన వారిద్దరిని బృందమ్మ ఉతికి పారేశారు. ‘అనారోగ్యం సాకుగా చూపి నా భర్తను కేబినెట్ నుంచి తప్పిస్తారా? ఏం? మీ చంద్రబాబు నాయుడుకు ఎటువంటి అనారోగ్యాలు లేవా?' వెటకారం చేస్తూ మరీ ఎదురుదాడికి దిగారు. తామూ ఏదైనా పార్టీలోకి మారడం గానీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం గానీ చేస్తామని బృందమ్మఅనగానే మంత్రి గంటా శ్రీనివాసరావు సర్ది చెప్పబోయారు. ఇక ఆమె ఒంటికాలిపై లేచిపోయారు.

నువ్వా మాకు నీతులు చెప్పేది?

నువ్వా మాకు నీతులు చెప్పేది?

‘నువ్వెవడివిరా? మాకు నీతులు చెప్పడానికి. ఇప్పటి వరకు నీవు ఎన్ని పార్టీలు మారావు' అని దుమ్ము దులిపేశారు. 1999 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున లోక్ సభకు ఎన్నికైన గంటా శ్రీనివాసరావు 2009 ఎన్నికల నాటికి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.

గంటా రాజకీయ ప్రాతినిధ్యం ఇదీ...

గంటా రాజకీయ ప్రాతినిధ్యం ఇదీ...

2011లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాసరావు.. 2014లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ పట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికై తిరిగి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా చేరారు. రాష్ట్ర మంత్రి ఎం నారాయణ, గంటా శ్రీనివాసరావు వియ్యంకులు. వియ్యంకులిద్దరిపై రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా.. చంద్రబాబు నాయుడు మాత్రం వారిద్దరిలో ఏ ఒక్కరినీ తప్పించే సాహసం చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నారు.

విలువ లేదంటున్న గౌతు శివాజీ

విలువ లేదంటున్న గౌతు శివాజీ

క్యాబినెట్‌లో చోటు దక్కించుకోలేకపోయిన నేతల్లో గౌతు శ్యామ సుందర్ శివాజీది మరో గాథ. ‘ఇది రాజకీయ‘చెద'రంగం... సరిగ్గా ఆడలేకపోయా... అందుకే మంత్రి పదవి రాలేదేమో! నా సీనియార్టీని చంద్రబాబు గుర్తించి ఆ మంత్రి పదవి ఇస్తారేమోనని భావించానే గానీ కానీ ఆశపడలేదు! పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నా! దానికి గుర్తింపు రాలేదు' శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ సీనియర్‌ నాయకుడు గౌతు శ్యామసుందర శివాజీ ఆవేదన.

అచ్చెన్నాయుడికి ప్రాధాన్యం పట్ల కినుక

అచ్చెన్నాయుడికి ప్రాధాన్యం పట్ల కినుక

శ్రీకాకుళం జిల్లాలో తన సమకాలీనుడైన కిమిడి కళావెంకటరావు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి వచ్చినా.., మరో సమకాలీన నేత ఎర్రన్నాయుడి తమ్ముడు అచ్చెన్నాయుడికి ప్రాధాన్య శాఖలతో ప్రమోషన్‌ ఇవ్వడం శివాజీ ఆవేదనకు కారణమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కార్మిక, క్రీడా శాఖల నిర్వహణలో విఫలమైనా, రవాణా, బీసీ సంక్షేమం వంటి కీలక శాఖలు అచ్చెన్నాయుడికి అప్పగించడంలో అంతరార్థమేమిటో.. బాగా పనిచేయడం కన్నా చంద్రబాబు మెచ్చిన సుగుణమేదో ఆయనలో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు కేంద్రం గౌతు

కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు కేంద్రం గౌతు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1983లో తెలుగునాట తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించే వరకూ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో ఆరితేరిన గౌతు లచ్చన్న తనయుడే గౌతు శ్యామ సుందర్ శివాజీ. 1983లో ఎన్టీఆర్ సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ రూపంలో కాంగ్రెస్ వ్యతిరేక వేదిక దొరికిందన్న ఆనందంలో లచ్చన్న తన కొడుక్కి టీడీపీ టిక్కెట్ ఇప్పించుకుని రాజకీయంగా తప్పుకున్నారు లచ్చన్న. కానీ ప్రస్తుతం డబ్బే పరమావధిగా, అవకాశ వాదమే ముఖ్యమైన అర్హతగా మారిన పరిస్థితుల్లో లచ్చన్న వారసుడిగా.. నిబద్ధత గల నాయకుడిగా శ్యామ సుందర్ శివాజీకి చంద్రబాబు మొండిచేయి చూపారనే విమర్శలు ఉన్నాయి.

పార్టీ ఫిరాయించిన వారికి అందలమా?

పార్టీ ఫిరాయించిన వారికి అందలమా?

పార్టీని తిట్టిన వారికి.. ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన వారికి క్యాబినెట్‌లో అందలం ఎక్కిస్తారా? టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ పార్టీ మంత్రివర్గం నడుస్తోందనే చర్చ జరుగుతోందని, రాజకీయం వ్యాపారంగా మారిందని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నష్టం జరిగినా కూడా ఇలాంటి రాజకీయం తాను చేయబోనని, టీడీపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రస్తుతం పార్టీ నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ఆవేదనే తాను వెలిబుచ్చానన్నారు. పార్టీలో క్రమశిక్షణ ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. తన వ్యాఖ్యలకు, రాజీనామాకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

చిన రాజప్ప రాయబారం విఫలం

చిన రాజప్ప రాయబారం విఫలం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తీరును నిరసిస్తూ ఆదివారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప తూర్పు గోదావరి జిల్లా రాజ మహేంద్రవరం వచ్చారు. గోరంట్లతో దాదాపు గంటసేపు ఏకాంత చర్చలు జరిపినా ఆయన ఏమాత్రం శాంతించలేదు. ఆగ్రహంతో ఉన్న గోరంట్ల.. ఎమ్మెల్యేగా తనకు ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లను వెనక్కు పంపుతున్నట్లు తెలిపారు. దీంతో చినరాజప్ప రాయబారం విఫలమైందన్న మాటలు వినిపిస్తున్నాయి.

చేసిన మాట నిజమేనన్న చినరాజప్ప

చేసిన మాట నిజమేనన్న చినరాజప్ప

తెలంగాణలో సీఎం కే చంద్రశేఖర్ రావు.. సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున ఎన్నికైన తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు తమ పార్టీ విమర్శించిన మాట నిజమేనని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప అంగీకరించారు. గోరంట్లను బుజ్జగించేందుకు రాజమండ్రికి వచ్చిన చిన రాజప్ప మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చామని సమర్థించుకున్నారు.

English summary
Internal bickerings in Telugu Desam party after Andhra Pradesh CM Nara Chandrababu Naidu's cabinet expansion may further increase.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X