భోగాపురం వద్దు-విశాఖలోనే ఎయిర్ పోర్టు-బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్..!
విశాఖపట్నంలో ఉన్న ఎయిర్ పోర్టు (Vizag Airport )ను కొత్తగా ప్రారంభిస్తున్న భోగాపురం ఎయిర్ పోర్టుకు తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని బీజేపీ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తప్పుబట్టారు. విశాఖ ఎయిర్ పోర్టును కొనసాగిస్తూనే భోగాపురాన్ని కూడా కొనసాగిస్తే బావుంటుందని ఆయన ప్రభుత్వానికి సూచించారు. లేకపోతే పెట్రోల్, డీజిల్ సంక్షోభం తగ్గాక భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంబించాలని కోరారు.
భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభమైతే నెలకు 2.50 లక్షల మంది విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తారని, ఒక్కసారికి భోగాపురం వెళ్లడానికే 3 వేలు ఛార్జ్ చేసే పరిస్ధితి ఉందన్నారు. అంటే నెలకు 75 కోట్లు, ఏడాదికి దాదాపు 900 కోట్లు ప్రజలకు ఖర్చవుతుందని, ఇందులో అత్యధిక భాగం పెట్రోల్, డిజిల్ కే ఖర్చవుతుందని ఆయన తెలిపారు. భోగాపురం ప్రారంభించిన తర్వాత యాజమాన్యానికి పదేళ్ల మారిటోరియం ఉంది కాబట్టి మరో ఆరునెలలో, ఏడాదో వాయిదా వేస్తే బాగుండేదన్నారు. ప్రజల్ని అడిగినా వైజాగ్ ఎయిర్ పోర్ట్ అందుబాటులో ఉంటే మంచిదని చెప్తారన్నారు.

ఇప్పటికిప్పుడు భోగాపురం అంటే జనం గుండెల్లో రాయి పడుతోందని, విజయవాడకు వెళ్లాలన్నా వందే భారత్ ఎక్కాల్సిందేనని, వెంటనే టికెట్లు కూడా దొరకవని విష్ణుకుమార్ రాజు తెలిపారు. వందే భారత్ రైళ్ల సంఖ్య అయినా పెంచాక భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మహానాడునే పెట్రోల్, డీజిల్ ఆదా చేసేందుకు హైబ్రిడ్ విధానంలో పెడితే సక్సెస్ అయిందన్న విషయం గుర్తించాలన్నారు. ఇప్పటివరకూ 62 ఏళ్లుగా విశాఖ ఎయిర్ పోర్టు కార్యకలాపాలు సాగిస్తోందని, ఒక్కసారి రక్షణశాఖకు ఇచ్చేస్తే 62 ఏళ్లు కాపురం చేసి విడాకులు ఇచ్చినట్లు ఉంటుందన్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వంటి నగరాలకు ఇక్కడి నుంచి కనీసం రెండు గంటల పాటు విమానాలు నడిపితే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

నోయిడాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ రెండేసి ఎయిర్ పోర్టులు ఉన్నాయని, ఇక్కడ కూడా రెండు ఎయిర్ పోర్టులు ఉంటే తప్పులేదన్నారు. ఈ దిశగా జీఎంఆర్ కూడా విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఆపరేట్ చేయాలన్నారు. యూజర్ ఛార్జీల్ని ఇక్కడే వసూలు చేసుకోవాలని, అప్పుడు పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుందని తెలిపారు. 98 శాతం ప్రజలు విశాఖలోనే ఎయిర్ పోర్టు కొనసాగించాలని చెబుతారని, కాబట్టి విశాఖ, భోగాపురంలో సమాంతర కార్యకలాపాలు కొనసాగించాలని కోరారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ఇబ్బంది లేదని పేర్కొన్నారు. భోగాపురం వెళ్లాలంటే రెండు గంటలు పడుతోందని, బాగా ట్రాఫిక్ జామ్ అవుతోందని, కనీసం బీచ్ కారిడార్ పూర్తయ్యే వరకూ విశాఖలో ఎయిర్ పోర్టు కొనసాగిస్తే కొంపలేం మునిగిపోవన్నారు.












Click it and Unblock the Notifications