చంద్రబాబు పర్యటనకు ముందు తిరుపతిలో బాంబుల కలకలం.. ఆ మెయిల్స్ తో పోలీసులు అలెర్ట్!
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల పైన కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మందిగా భక్తులు తిరుమలకు వెళుతుంటారు. ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల కు వచ్చే భక్తులకు భద్రత కల్పించడం కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో అడుగడుగు ఎప్పటికప్పుడు గాలిస్తూనే ఉంటారు.
తిరుపతిలో బాంబుల కలకలం
తిరుమల తిరుపతి విషయంలో భక్తులు షాక్ కు గురయ్యే ఒక వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. తిరుపతిలో బాంబు బెదిరింపులు స్థానికంగా ఆందోళనకు కారణంగా మారాయి. తిరుపతిలో బాంబు పెట్టారని, నాలుగు ప్రాంతాలలో ఆర్డీఎక్స్ పదార్థాలతో పేలుళ్లకు పాల్పడతారని రెండు అనుమానాస్పదమైన ఈమెయిల్స్ పోలీసులకు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వివిధ ప్రాంతాలలో తనిఖీలను నిర్వహిస్తున్నారు.

ఐఎస్ఐ మాజీ ఎల్టిటిఇ మిలిటెంట్ల కుట్ర అంటూ ఈ మెయిల్స్
ఈ తనిఖీలలో బాంబు స్క్వాడ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తున్నాయి. తిరువళ్లూరు కేంద్రంగా ఐఎస్ఐ మాజీ ఎల్టిటిఇ మిలిటెంట్లు తిరుపతిలో విధ్వంసం సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే నాలుగు చోట్ల బాంబులు పెట్టి పేలుళ్లను జరపనున్నారని పేర్కొన్నారు. ఈ మెయిల్స్ తో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.
బాంబు బెదిరింపులతో అడుగడుగూ జల్లెడ పడుతున్న బాంబ్ స్క్వాడ్ బృందాలు
ముఖ్యంగా తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం ఆలయం, గోవిందరాజస్వామి వారి ఆలయం, కోర్టు ప్రాంగణం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాలలో కూడా పెద్ద ఎత్తున సోదాలు జరుపుతున్నారు. ఏ అనుమానాస్పద వస్తువులు కనిపించినా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో బాంబు స్క్వాడ్ బృందాలు అడుగడుగు జల్లెడ పడుతూ విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.
ఈనెల 6న చంద్రబాబు తిరుపతి పర్యటన.. భద్రతా బలగాల అలెర్ట్
కాగా ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల ఆరవ తేదీన తిరుపతి పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో తాజా బాంబు బెదిరింపులతో భద్రతా బృందాలు మరింత అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద కూడా భద్రతా బృందాలు క్షుణ్ణంగా తనిఖీలను చేపట్టాయి. ఇక ఈ మెయిల్స్ పైన తిరుమల పోలీసులు, ఇంటిలిజెన్స్ విభాగం, సైబర్ సెక్యూరిటీ విభాగాలు కలిసి దర్యాప్తు చేస్తున్నారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో తిరుపతిలో పోలీసుల గస్తీ బాగా పెంచారు.












Click it and Unblock the Notifications