పట్టిసీమ కోసమే పోలవరం జాప్యం: బాబుపై బొత్స ఫైర్
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఇష్టం లేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పట్టిసీమ ప్రాజెక్టు కోసం పోలవరాన్ని కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రూ. 2వేల కోట్ల రూపాయలు దోచుకునేందుకు సిద్ధమయ్యారని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎలాంటి మేలు జరగదని స్పష్టం చేశారు.
కేంద్ర బడ్జెట్‌లో న్యాయం జరగలేదని ఓ వైపు ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడుకుతుంటే.. టిడిపి, బిజెపి ఎంపీలు మాత్రం పార్లమెంటులో అసలు ఈ అంశంపైనే స్పందించకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ మార్చి 10 నుంచి జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేయనున్నట్లు తెలిపారు.

క్షీణించిన రవీంద్రనాథ్ రెడ్డి ఆరోగ్యం
కడప: కమాలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష బుధవారం నాటికి నాలుగో రోజుకు చేరింది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జిఎన్ఎస్ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు, నీరు అందించాలనే డిమాండ్‌తో రవీంద్రనాథ్ రెడ్డి వీరపునాయునిపల్లెలో ఆదివారం నిరవధిక దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
దీక్షలో ఉన్న ఆయనను పలువురు నేతలు పరామర్శించి వెళ్లారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు షుగర్ లెవెల్స్, రక్త పీడనం మెలమెల్లగా పడిపోతున్నాయని చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!