కిరణ్‌పై బొత్స అప్రమత్తం, మంత్రులకు కమల్ బుజ్జగింపు
హైదరాబాద్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వార్తతో అధిష్టానానికి అండగా ఉంటున్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అప్రమత్తమయ్యారు. ఆదివారం సాయంత్రం కిరణ్ క్యాంపు కార్యాలయంలో పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో భేయీ అయిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పైన లోకసభలో చర్చకు వచ్చే రోజు కిరణ్ రాజీనామా చేస్తారని, కొత్త పార్టీ పెట్టేందుకే ఆయన మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గం చెబుతోంది. ఈ నేపథ్యంలో బొత్స అప్రమత్తమై పలువురు నేతలతో భేటీ అవుతున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఆయన సీమాంధ్ర నేతలతో భేటీ అవనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే మంత్రులు రఘువీరా రెడ్డి, కొండ్రు మురళీ, బాలరాజు, శైలజానాథ్, టిజి వెంకటేష్ తదితర మంత్రులతో ఉదయం సమావేశమయ్యారు. వారితో రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఇందులో పలువురు నిన్న ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. కొందరు నేతలను బుజ్జగిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కాగా మంత్రి మహీధర్ రెడ్డి, ఎమ్మెల్యే జయసుధ, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డిలు మధ్యాహ్నం సిఎంతో సమావేశమయ్యారు.
కేంద్రమంత్రులకు కమల్, జైరామ్ బుజ్జగింపు
సభలో నిరసనలు తెలుపుతున్న కేంద్రమంత్రులను కాంగ్రెసు పార్టీ పెద్దలు కమల్ నాథ్, జైరామ్ రమేష్‌లు బుజ్జగిస్తున్నారని సమాచారం. ఆందోళన విరమించుకోవాలని ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ కూడా కోరినప్పటికీ వారు మాత్రం తగ్గటం లేదు. కాగా, సోమవారం పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తుండగా కిషోర్ చంద్రదేవ్, జెడి శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణిలు సీట్లకే పరిమితమయ్యారు.












Click it and Unblock the Notifications