గవర్నర్‌తో బొత్స, ప్రభుత్వం కోసమా? సీన్ లేదని డొక్కా
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణలు గురువారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. వారు గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్‌తో భేటీ అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ... తాము మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిశామని చెప్పారు. తాము కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతామని ఆయనకు చెప్పామన్నారు. రాష్ట్రపతి పాలన తదితర అంశాలపై రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమే అన్నారు. తమ కలయికలో ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పారు.

కొత్త ప్రభుత్వం కోసమా?
బొత్స, కన్నా, రఘువీరా, ఆనంలు గవర్నర్‌ను కలిసింది కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకా అనే చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి రేసులో వీరు నలుగురు ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే అధిష్టానం కూడా ప్రభుత్వ ఏర్పాటు పైన కూడా ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారు కలవడం గమనార్హం.
కిరణ్ ఎప్పటికైనా కాంగ్రెసు పార్టీలోకే: కొండ్రు
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటికైనా కాంగ్రెసు పార్టీలోకి రావాల్సిన వారేనని మాజీ మంత్రి కొండ్రు మురళి శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందన్నారు. విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎవరినైనా సమర్థిస్తా: డొక్కా
ఎవరిని ముఖ్యమంత్రిగా చేసినా తాను నిరభ్యంతరంగా మద్దతు పలుకుతానని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు డొక్కా మాణిక్య వర ప్రసాద్ గురువారం చెప్పారు. తెలంగాణ వారిని సిఎంగా చేసినా తాను మద్దతిస్తానన్నారు. బలహీనవర్గాలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది తన అభిప్రాయమని చెప్పారు. తన ఛాయిస్ జెడిశీలం, కొండ్రు మురళీ, పనబాక లక్ష్మి అన్నారు. తనకు ముఖ్యమంత్రి అయ్యే శక్తి లేదన్నారు. కాగా, కిరణ్ రాజీనామా అనంతరం రాష్ట్రపతి పాలన, కొత్త ప్రభుత్వంపై జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.
స్పీకర్ కార్యాలయానికి రాజీనామా
కిరణ్ కుమార్ రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించిన విషయం తెలిసిందే. దానిని స్పీకర్ కార్యాలయానికి పంపిచారు.
పదవుల కోసం కక్కుర్తి
తెలంగాణ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో కాంగ్రెస్ నేతలు పదవుల కోసం వెంపర్లాడుతున్నారని టిడిపి సీనియర్ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో పదవుల కోసం కక్కుర్తిపడడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సమైక్య వాద ముసుగులో జగన్, కిరణ్ డ్రామాలాడుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. కాంగ్రెస్, జగన్, కెసిఆర్ ముగ్గురు కుమ్మక్కయి కుట్ర పన్నుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విభజన జరిగితే తెలంగాణ జిల్లాల రైతులకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications