టీడీపీ రాజకీయ వ్యాపారం చేస్తోందన్న బొత్స, ఎంపీలు విఫలం: రఘువీరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యాపారం చేస్తోందని పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ అసెంబ్లీని అధికార పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా వాడుకుంటోందని ఆరోపణలు చేశారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అసెంబ్లీలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టును మరుగున పెట్టేందుకే పట్టిసీమ పేరుతో కొత్త ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చారని అన్నారు.
దీని వల్ల పోలవరం ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం పొంచి ఉందని బొత్స ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు కోసం కేటాయించిన 1400 కోట్లతోపాటు ప్రోత్సాహకం పేరుతో అదనపు మొత్తాలు ఇస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు.

లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. దీనిపై పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పందించారు. లోక్‌సభలో అంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీని పొగుడుతూ రాష్ట్రానికి సరైన న్యాయం చేయలేకపోయారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని రఘువీరా రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లును ఏపీ ఎంపీలు సద్వినియోగం చేసుకోలేక పోయారన్నారు.












Click it and Unblock the Notifications