విశాఖలో విజయం వైసీపీదే..ప్రతిపక్షంలో ఉండి ఏకగ్రీవం
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికకు మంగళవారం చివరి తేదీ కావడంతో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉండటంతో.. స్వతంత్ర్య అభ్యర్థిగా ఉన్న షఫీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పోటీలో ఎవరు లేకపోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో రిట్నరింగ్ అధికారి ఎల్లుండి బొత్స పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.
విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ వంశీ యాదవ్ తన పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరడమే కాకుండా ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. వంశీ యాదవ్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక అనివార్యం అయింది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ బలంగా ఉండటంతో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహారించారు.

పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా రంగంలో దించి అధికార పక్షానికి గట్టి షాక్ ఇచ్చారు. సరైన సంఖ్యబలం లేకపోవడం, పోటీకి నాయకులు సముఖత వ్యక్తం చేయకపోవడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది.స్వతంత్ర్య అభ్యర్థిగా ఉన్న షఫీ తప్పుకోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు సెలవు దినం కావడంతో దీనిపై అధికారికంగా శనివారం ఓ ప్రకటన చేయనున్నారు. ఈ విజయంపై వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏకగ్రీవంగా విజయం సాధిస్తారని, ప్రతిపక్షంలో ఉండి, అది కూడా జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే లేని చోట ఏకగ్రీవంగా గెలవడం అంటే మామూలు విషయం కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ ప్రలోభాలకు పార్టీ నేతలు తలొగ్గకుండా నిజాయితీగా నిలబడటం వల్లే ఈ విజయం దక్కిందని వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ విజయంతో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు వైసీపీ ఖాతాలో చేరింది.












Click it and Unblock the Notifications