'తిరుపతి తొక్కిసలాట' వెనుక ఆ నాయకుడు: టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాది జనవరిలో జరిగిన తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి తొక్కిసలాట వెనుక వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన హయాంలోనే ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భూమన అతిపెద్ది అవినీతి పరుడని మండిపడ్డారు. టీటీడీలో భూమన కమీషన్ల ఛైర్మన్ గా వ్యవహరించారని ఆరోపణలు చేశారు.
తిరుపతి ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి అబద్దపు ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయుడు మండిపడ్డారు. గోవుల మృతిపై కావాలనే మార్ఫింగ్ ఫొటోలు విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని మండిపడ్డారు. మార్ఫింగ్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. అనారోగ్యం, వృద్ధాప్యంతో గోవులు మరణించాయని.. ఇందులో టీటీడీ నిర్లక్ష్యం ఏమీ లేదని బీఆర్ నాయుడు తెలిపారు.
ఏం జరిగింది :
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం బైరాగిపట్టెడలోని రామానాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సత్యనారాయణపురం జెడ్పీ హైస్కూల్, విష్ణునివాసం, శ్రీనివాసం, ఇందిరా మైదానం, రామచంద్రపుష్కరణి, ఎమ్మార్ పల్లి ప్రాంతాలకు భారీగా తరలివచ్చారు.

అయితే బైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద రాత్రి 8 గంటల సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురవడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు. అయితే క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరిచారని భావించిన కొంతమంది భక్తులు ఒక్కసారిగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తోసుకుంటూ ముందుకు రావడంతో చాలామంది కిందపడిపోయారు. ఈ ఘటనలో కొంతమంది చనిపోయారు. ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.












Click it and Unblock the Notifications