ఆస్తి కోసం... తమ్ముడిని చంపేసిన అన్నలు...
నేటి సమాజంలో బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండా పోయింది. ప్రపంచమంతా డబ్బుతో నడుస్తోంది. ఈ డబ్బు కారణంగా పేగుతెంచుకున్న బంధాలు కూడా దూరమవుతున్నాయి. తాజాగా, ఆస్తికోసం అన్నలు తోడబుట్టిన తమ్ముడి ప్రాణాలనే తీశారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలతో ఇద్దరు అన్నలు కలిసి ఓ తమ్ముడిని బలి తీసుకున్నారు. మూడు రోజుల పసికందుకు తండ్రి ప్రేమను దూరం చేశారు.
చిన్నారికి తండ్రి ప్రేమను దూరం చేశారు : శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం తమ్ముడ్ని సొంత అన్నలు హత్య చేయడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంచిలి మండలం కేసరపడకు చెందిన బద్రి ఖేత్రి మర్చంట్ నేవీ విశాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగి పనిచేస్తున్నారు. అయితే, ఏడాది నుంచి ఈయన తన స్వగ్రామంలోనే ఉంటున్నారు. ఆయనకు ఏడాది కిందట ఒడిశాలోని జయంతిపురానికి చెందిన శిరీషతో వివాహమైంది. మూడు రోజుల కిందట ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, బద్రీ ఖేత్రికి ఇద్దరు అన్నలు ఉన్నారు. వారు వాసు, కూర్మారావులు. అయితే, వీరి ముగ్గురికి ఆస్తి పంపకాల విషయంలో 2022 నుంచే గొడవలు ప్రారంభమయ్యాయి. అవి చిలికి చిలికి చివరికి ప్రాణాలను తీసుకునే పరిస్థితికి వచ్చాయి.

బహిర్భూమికి వెళ్తుండగా దాడి : ఆస్తి విషయంలో గతంలో ఒకసారి ఖేత్రి తన రెండో అన్నయ్య వాసుపై దాడి చేశారు. దీనికి సంబంధించి అప్పట్లో పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అయితే, అప్పటి నుంచి వారి మధ్య వివాదం మరింతగా పెరిగింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి బహిర్భూమికి వెళ్తున్న ఖేత్రిపై ఇద్దరు అన్నయ్యలు కలిసి మారణాయుధాలతో దాడి చేశారు. ఖేత్రీ కాలుని శరీరం నుంచి వేరు చేసి, తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. అయితే, తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. భర్త మరణవార్త విన్న శీరిష రోదనలు అక్కడివారిని కంటతడి పెట్టించాయి. మూడురోజుల చిన్నారికి నాన్న ప్రేమ దూరం అయ్యింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థలాన్ని పలాస డీఎస్పీ, సోంపేట సీఐ పరిశీలించడం జరిగింది.












Click it and Unblock the Notifications