2019లో వైసిపి నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తారని..: బాంబు పేల్చిన టిడిపి నేత
వైసిపి నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అధిష్టానానికి పురంధేశ్వరి లేఖ రాసిన అంశం తెలుగుదేశం పార్టీలో ఆగ్రహం తెప్పిస్తోంది.
విజయవాడ: వైసిపి నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అధిష్టానానికి పురంధేశ్వరి లేఖ రాసిన అంశం తెలుగుదేశం పార్టీలో ఆగ్రహం తెప్పిస్తోంది. పురంధేశ్వరికి ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా, టిడిపి నేత బుద్ధా వెంకన్న మరో ముందడుగు వేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో (2019) పురంధేశ్వరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోందని బాంబు పేల్చారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, అప్పుడు జరిగిన పార్టీ ఫిరాయింపుల గురించి నాడు ఆమె ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై పురంధేశ్వరి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
జగన్ అవినీతి, సూటుకేసు కంపెనీల గురించి పురంధేశ్వరి ఏనాడైనా మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. కాబట్టి ఆమె వచ్చే ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేస్తుందని అనుమానం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు పురంధేశ్వరి సమాధానం చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications