జగన్ తెలుసుకో: పవన్ సూచనలపై బుద్ధా, అనంతపురంలో బాబుకు అలా చెక్ పెట్టే వ్యూహం
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే తన ఆస్తులను ప్రకటించాలని ఏపీ శాసన మండలిలో ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న సవాల్ చేశారు. వైసీపీ నాయకులకు కావాల్సింది రాజకీయాలు గానీ అభివృద్ధి కాదన్నారు.
తమ కుటుంబం ఆస్తులను నిజాయతీగా ప్రకటించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పైన వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు, టీడీపీ పాలన, రాజధాని తదితర అంశాలపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
Recommended Video


జగన్‌కు ధైర్యం ఉందా
ఇప్పుడు ఇప్పుడు లోకేష్ ప్రకటించిన ఆస్తులపైన అదే తరహాలో ఆరోపణలు చేస్తోందని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ఆ పార్టీ నాయకులు లోకేష్‌ను విమర్శించే ముందు తమ అధినేతకు జగన్‌ను ఆస్తులపై ప్రకటన చేయాలని సూచించాలని చెప్పారు. అందుకు ధైర్యం ఉందా అని నిలదీశారు.

జగన్ తెలుసుకోవాలి
ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో జగన్ ముందు తెలుసుకోవాలని బుద్ధా వెంకన్న సూచించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పర్యటనపై స్పందిస్తూ.. ఆయన సూచనలను తప్పకుండా పాటిస్తామని చెప్పారు.

బీసీ ఓట్లు దండుకొని
కాగా, బీసీ కులాలకు రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు తెస్తామని జగన్ శనివారం అనంతపురం జిల్లా గార్లదిన్నెలో ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా అన్నారు. బీసీ ఓట్లను దండుకొని అధికారం చేపట్టిన చంద్రబాబు విలన్‌లా వ్యవహరిస్తూ, ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు.

చంద్రబాబు అలా రెచ్చగొట్టారు
వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తున్నట్లు ప్రకటించి ఇతర బీసీ కులాల నాయకులకు ఫోన్లు చేసి ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని చంద్రబాబు రెచ్చగొట్టారని జగన్ ఆరోపించారు. వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం కల్పిస్తూ వెనుకబడిన కులాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ జాబితాల్లోకి చేర్చేందుకు కృషి చేస్తానన్నారు.

చంద్రబాబుకు అలా చెక్ చెప్పే ప్రయత్నం
అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉన్న పార్లమెంటు స్థానాల్లో బీసీలకు తప్పక ఒక్కొక్కటి చొప్పున ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అనంతపురం పార్లమెంటు స్థానం వాల్మీకులకు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చి మద్దతు కూడగట్టాలనుకున్న చంద్రబాబుకు జగన్ టిక్కెట్ ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ స్థానాన్ని వాల్మీకులకు ఇస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications