అమరావతి శంకుస్థాపనకు డుమ్మా కొట్టిన పవన్ కళ్యాణ్: షూటింగ్‌లో బిజీ బిజీ
అమరావతి: జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్యయంగా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌లు సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ స్పాట్ కు వచ్చి మరీ ఆహ్వానించారు. ఆహ్వాన పత్రిక అందుకున్న వెంటనే మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను శంకుస్థాపనకు వస్తానో? లేదో అనే అనుమాంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
అయితే కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని మంత్రులు ఆయనను కోరారు. శంకుస్థాపనకు రావాలని తనకూ ఉందని, అయితే షూటింగ్ షెడ్యూల్ అందుకు అనుమతించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరుపై అయోమయం నెలకొంది.

అయితే అందరూ అనుమానించినట్లే ఈరోజు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. ప్రస్తుతం గుజరాత్‌లో జరుగుతున్న తన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ లో ఆయన బిజీగా ఉన్నారు. మరోవైపు రాజధాని అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది.
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అమరావతి నిర్మాణానికి నిర్వహిస్తున్న శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది ప్రజలు అమరావతికి తరలివస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే ప్రజలు బస్సుల్లో శంకుస్థాపన ప్రాంతానికి చేరుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications